‘ఫినిషర్‌ అంటే అలా ఉండాలి’

7 Nov, 2020 19:39 IST|Sakshi

సిడ్నీ: క్రికెట్‌లో ఫినిషర్‌ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేపేరు టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని. వరల్డ్‌ అత్యుత్తమ ఫినిషర్‌గా ధోని ఆడిన ఎన్నో ఇన్నింగ్స్‌లే అతన్ని బెస్ట్‌ ఫినిషర్‌ను చేశాయి. అయితే మరో అత్యుత్తమ ఫినిషర్‌ భారత క్రికెట్‌ జట్టులోనే ఉన్నాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ టామ్‌ మూడీ అంటున్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1లో ముంబై ఇండియన్స్‌ సాధించిన తర్వాత హార్దిక్‌ పాండ్యాపై మూడీ ప్రశంసలు కురిపించాడు. 14 బంతుల్లో అజేయంగా 37 పరుగులు సాధించి మొత్తం మ్యాచ్‌ స్వరూపాన్నే హార్దిక్‌ మార్చేశాడని మూడీ కొనియాడాడు.

ఆ ఇన్నింగ్స్‌లో హార్దిక్‌ ఒక్క ఫోర్‌ కూడా కొట్టకుండా ఐదు సిక్సర్లు సాధించడాన్ని మూడీ ప్రస్తావించాడు. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన మూడీ..‘ హార్దిక్‌ లాంటి ఫినిషర్లను చాలా అరుదుగా చూస్తాం. ఫినిషర్‌ అంటే అలా ఉండాలి. ముంబై 170-175 పరుగులు చేస్తుందనే దశ నుంచి రెండొందలకు తీసుకెళ్లాడు. ప్రతీ ఒక్కరూ ఆ తరహా ఫినిషింగ్‌ ఇవ్వాలని అనుకుంటారు. హార్దిక్‌ పాండ్యా ఆటతో మ్యాచ్‌ అప్పుడే వారి వశమై పోయింది. ఆ మ్యాచ్‌లో టర్నింగ్‌ పాయింట్‌ ఏదైనా ఉందంటే అది హార్దిక్‌ ఆడిన ఇన్నింగ్సే’ అని మూడీ పేర్కొన్నాడు.ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1లో ముంబై ఇండియన్స్‌  57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా తుది బెర్తును ఖరారు చేసుకుంది. లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీని ఏదశలోనూ తేరుకోనివ్వని ముంబై తనమార్కు ఆట తీరుతో చెలరేగిపోయింది. హార్దిక్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో  201 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.

మరిన్ని వార్తలు