T20 WC: రోహిత్‌, హార్దిక్‌, సూర్య.. ఎవరైనా సరే.. ఫామ్‌లో లేకుంటే కెప్టెన్సీ వద్దు!

11 Dec, 2023 12:30 IST|Sakshi
రోహిత్‌ శర్మ- హార్దిక్‌ పాండ్యా- సూర్యకు​మార్‌ యాదవ్‌ (PC: BCCI)

స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి టీమిండియా పగ్గాలు వదిలేశాక చాలా మంది ‘కెప్టెన్లు’ అయ్యారు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హాజరీలో కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌, జస్‌‍ప్రీత్‌ బుమ్రా వేర్వేరు సందర్భాల్లో భారత జట్టు సారథులుగా వ్యవహరించారు.

ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్‌ సందర్భంగా సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా తాజాగా ఈ జాబితాలో చేరాడు. ఇక టీ20 ప్రపంచకప్‌-2022 ముగిసిన తర్వాత రోహిత్‌ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అనధికారిక కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

సూర్య కూడా వచ్చీ రాగానే
అయితే, వన్డే వరల్డ్‌కప్‌-2023 సందర్భంగా గాయపడ్డ పాండ్యా ఇంకా కోలుకోకపోవడంతో ఆసీస్‌తో సిరీస్‌ సూర్య సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అంతేకాదు 4-1తో జట్టును గెలిపించి ట్రోఫీ అందించాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలోనూ టీ20 జట్టును ముందుండి నడిపించే అవకాశం దక్కించుకున్నాడు.

ఇక ఈ ప్రొటిస్‌తో సిరీస్‌ తర్వాత టీమిండియా అఫ్గనిస్తాన్‌తో పొట్టి ఫార్మాట్‌లో సిరీస్‌ ఆడనుంది. టీ20 ప్రపంచకప్‌-2024కు ముందు భారత జట్టు ఆడే ఆఖరి సిరీస్‌ ఇది. అప్పటికి కూడా పాండ్యా అందుబాటులోకి రాకపోతే కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తాన్నది ఆసక్తికరంగా మారింది. 

కెప్టెన్సీ ముఖ్యం కాదు
రోహిత్‌ శర్మ తిరిగి పగ్గాలు చేపడతాడా? లేదంటే.. సూర్యకు మరోసారి ఛాన్స్‌ ఇస్తారా? చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ కెప్టెన్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. సారథి ఎవరన్న అంశంతో సంబంధం లేదని.. ప్రపంచకప్‌నకు సరైన జట్టును ఎంపిక చేశామా లేదా అన్నదే ముఖ్యమని పేర్కొన్నాడు.

‘‘కెప్టెన్సీ అనేది అసలు విషయమే కాదు. అన్నిటికంటే జట్టు కూర్పు ముఖ్యం. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు ఎవరో తొలుత గుర్తించండి. అంతేకాదు ఫామ్‌లో ఉన్న ఆటగాడినే కెప్టెన్‌ చేయండి.
 
సరైన జట్టును ఎంచుకోవడం ముఖ్యం
రోహిత్‌ శర్మ లేదంటే హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌.. ఎవరైనా సరే ఫామ్‌లో లేకుంటే కెప్టెన్‌గా అనర్హులుగానే పరిగణించాల్సి ఉంటుంది. సారథి ఎంపిక అంత ముఖ్యమేమీ కాదన్న మాటకు కట్టుబడి ఉంటాను. ఎందుకంటే.. టీ20 వరల్డ్‌కప్‌ వంటి మెగా ఈవెంట్లలో సరైన జట్టును ఎంపిక చేశామా లేదా అన్నదే అతి ముఖ్యమైనది.

ఈ టోర్నీ కంటే ముందు ఐపీఎల్‌-2024 జరుగనుంది. కాబట్టి ఐపీఎల్‌ ప్రదర్శన ఆధారంగానూ టీమిండియాకు ఆటగాళ్లను ఎంపిక చేస్తే బాగుంటుంది’’ అని గంభీర్‌.. ఇండియా టుడేతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.  కాగా వచ్చే ఏడాది జూన్‌ 4 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా ప్రపంచకప్‌-2024 ఆరంభం కానుంది. 

చదవండి: #Virushka Anniversary: అందుకే విరాట్‌ కోహ్లి పేరును రాహుల్‌గా మార్చి మరీ! కేవలం 42 మంది..

>
మరిన్ని వార్తలు