జింబాబ్వేకు షాకిచ్చిన ఐర్లాండ్‌.. టీ20 సిరీస్‌ సొంతం

11 Dec, 2023 09:34 IST|Sakshi
జింబాబ్వేను చిత్తు చేసిన ఐర్లాండ్‌ (PC: Cricket Ireland X)

Zimbabwe vs Ireland, 3rd T20: జింబాబ్వే పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుకు గట్టి షాకిచ్చింది ఐర్లాండ్‌ క్రికెట్‌ జట్టు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో ఆరు వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తద్వారా సిరీస్‌ను కైవసం చేసుకుంది.

మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు ఐర్లాండ్‌ జింబాబ్వే టూర్‌కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి టీ20లో ఆఖరి బంతి వరకు ఆతిథ్య, పర్యాటక జట్ల మధ్య ఉత్కంఠ పోరు నడించింది. అయితే, గురువారం నాటి ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఐరిష్‌ టీమ్‌పై ఒక వికెట్‌ తేడాతో నెగ్గి గట్టెక్కింది.

ఈ క్రమంలో రెండో టీ20లో ఐర్లాండ్‌ గత మ్యాచ్‌ తాలుకు పొరపాట్లను పునరావృతం కానివ్వలేదు. అద్భుత ఆట తీరుతో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో టీ20లో టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ తొలుత బౌలింగ్‌ చేసింది.

హ్యారీ టెక్టర్‌, డాక్రెల్‌ అద్భుత అజేయ ఇన్నింగ్స్‌
జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్‌ రియాన్‌ బర్ల్‌ 36 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 140 పరుగులు సాధించింది. ఈ క్రమంలో నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఐరిష్‌ జట్టుకు ఆదిలోనే షాకులు తగిలినా.. నాలుగో నంబర్‌లో వచ్చిన హ్యారీ టెక్టర్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.

అతడికి తోడుగా జార్జ్‌ డాక్రెల్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. హ్యారీ టెక్టర్‌ 45 బంతుల్లో 54, డాక్రెల్‌ 32 బంతుల్లో 49 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఐర్లాండ్‌ను గెలుపుతీరాలకు చేర్చారు. వీరిద్దరు రాణించడంతో 18.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టపోయి ఐర్లాండ్‌ లక్ష్యాన్ని ఛేదించింది. 

ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన లెఫ్టార్మ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ జార్జ్‌ డాక్రెల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. సిరీస్‌ ఆసాంతం అద్భుతంగా ఆడిన హ్యారీ టెక్టర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న ఐర్లాండ్‌ తదుపరి.. జింబాబ్వేతో బుధవారం నుంచి వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది.  

చదవండి: Ind vs Pak: భారత క్రికెట్‌ జట్టుకు నిరాశ.. సెమీస్‌ చేరాలంటే..

>
మరిన్ని వార్తలు