Tim Paine: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై!

17 Mar, 2023 15:22 IST|Sakshi

ఆస్ట్రేలియా టెస్టు జట్టు మాజీ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో టాస్మానియాకు ప్రాతినిథ్యం వహించిన పైన్‌.. తన 18 ఏళ్ల బంధానికి ముగింపు పలికాడు. శుక్రవారం షెఫీల్డ్ షీల్డ్‌ టోర్నీలో భాగంగా క్వీన్స్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం పైన్‌ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం అతడికి సహాచర ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా టిమ్ పైన్‌ కూడా  భావోద్వేగానికి గురయ్యాడు. ఇక పైన్‌ తన చివరి మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 3 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. షెఫీల్డ్ షీల్డ్‌ ట్రోఫీలో అతడు  95 మ్యాచ్‌లు ఆడాడు. అతడు 2005లో సౌత్ ఆస్ట్రేలియాపై ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.

ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అత్యధిక ఔట్‌లు చేసిన టాస్మానియన్ వికెట్ కీపర్‌గా పైన్‌(295) రికార్డు కలిగి ఉన్నాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో దాదాపు 30 సగటుతో అతడు 4000కు పైగా పరుగులు చేశాడు. కాగా పైన్‌ కెరీర్‌లో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. ముఖ్యంగా ఓ మహిళకు అభ్యంతరకర మెసేజీలు చేసిన ('సెక్స్‌టింగ్')  స్కాంలో పైన్‌ ఇరుక్కున్నాడు. దీంతో  అతడు 2021లో కీలకమైన యాషెస్‌  ఆసీస్‌ టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ వివాదం అతడి కెరీర్‌నే మలుపు తిప్పేసింది.


చదవండిబంగ్లాదేశ్‌ కెప్టెన్‌కు చేదు అనుభవం.. కాలర్ పట్టి లాగి! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు