IPL 2024: రూ. 10 కోట్ల వరకు వెళ్తామని గంగూలీ మాటిచ్చారు.. ధోనిలా ఉన్నాడంటూ..

21 Dec, 2023 13:51 IST|Sakshi
కుషాగ్ర- గంగూలీ (PC: BCCI)

IPL 2024 Auction: క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ వల్ల వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్లు ఎందరో ఉన్నారు. దేశవాళీ క్రికెట్‌, సెలక్షన్‌ క్యాంపులలో అసాధారణ ప్రతిభాపాటవాలతో ఆకట్టుకున్న ఆటగాళ్లకు ఫ్రాంఛైజీలు భారీ మొత్తం చెల్లించేందుకు కూడా సిద్ధపడతాయన్న విషయం తెలిసిందే. 

తమ జట్టుకు సదరు ఆటగాడు ఉపయోగపడతాడని భావిస్తే కనీస ధరతో సంబంధం లేకుండా కోట్ల వర్షం కురిపించిన దాఖలాలు కోకొల్లలు. ఐపీఎల్‌-2024 వేలం సందర్భంగా ఇలాంటి గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేశాడు ఓ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌. రూ. 20 లక్షల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చి ఏకంగా రూ. 7.20 కోట్లు కొల్లగొట్టాడు. 

అతడి పేరు కుమార్‌ కుషాగ్ర. ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడి కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌తో పోటీ పడి మరీ ఈ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అయితే, దీనంతటికి క్యాపిటల్స్‌ మెంటార్‌ సౌరవ్‌ గంగూలీనే కారణం అంటున్నాడు కుషాగ్ర తండ్రి శశికాంత్‌.

ధోనిలా వికెట్‌ కీపింగ్‌ చేస్తున్నాడంటూ
ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ట్రయల్స్‌ సందర్భంగా గంగూలీ కుషాగ్రతో మాట్లాడారు. నీకోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 10 కోట్ల వరకు ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడుతుందని కుషాగ్రకు చెప్పారు.

నిజానికి ట్రయల్స్‌లో భాగంగా కుషాగ్ర సిక్సర్లు బాదడం చూసి గంగూలీ ముచ్చటపడ్డారు. వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. అంతేకాదు.. కుషాగ్ర మహేంద్ర సింగ్‌ ధోని మాదిరే బెయిల్స్‌ను హిట్‌ చేస్తున్నాడంటూ కొనియాడారు.

ఉత్సాహపరిచేందుకు చెప్తున్నారనుకున్నా గానీ.. ఇలా అనుకోలేదు
వేలంలో కుషాగ్రను ఢిల్లీ కనీస ధరకే కొనుగోలు చేస్తుందని భావించాం. అయితే, ఆ తర్వాత అద్భుతాలు జరిగాయి. గంగూలీ మాట ఇచ్చినట్లుగానే ఇతర జట్లతో పోటీ పడీ మరీ మా వాడిని కొనుగోలు చేసేలా చేశారు. 

జార్ఖండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌
కుషాగ్రకు ఐదేళ్ల వయసు నుంచే క్రికెట్‌ అంటే ఇష్టం పెరిగింది. తను ఇక్కడిదాకా చేరుకోవడం గర్వంగా ఉంది’’ అని శశికాంత్‌ పేర్కొన్నారు. కాగా జార్ఖండ్‌కు చెందిన 19 ఏళ్ల వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కుమార్‌ కుషాగ్ర. గతేడాది రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఏకంగా 266 పరుగులు సాధించి వెలుగులోకి వచ్చాడు.

రంజీ చరిత్రలో ఓ మ్యాచ్‌లో 250కి పైగా రన్స్‌ చేసిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. లిస్ట్‌-ఏ, దేళవాళీ టీ20 క్రికెట్‌లోనూ సత్తా చాటాడు. తద్వారా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించి కాసుల వర్షంలో తడిశాడు.

చదవండి: తండ్రిది పాన్‌ షాప్‌.. గ్లవ్స్‌ కొనేందుకు కూడా డబ్బులు లేవు! ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్లు

>
మరిన్ని వార్తలు