IPL 2024: టైటాన్స్‌ను వీడి ముంబై కెప్టెన్‌గా హార్దిక్‌: తొలిసారి స్పందించిన నెహ్రా

21 Dec, 2023 13:00 IST|Sakshi
హార్దిక్‌ పాండ్యాతో నెహ్రా (పాత ఫొటో- PC: BCCI/IPL)

GT Coach Ashish Nehra Comments: గుజరాత్‌ టైటాన్స్‌ సారథిగా టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ సరైన వాడని ఆ జట్టు హెడ్‌కోచ్‌ ఆశిష్‌ నెహ్రా అన్నాడు. హార్దిక్‌ పాండ్యా లాంటి అనుభవజ్ఞుడైన, అద్భుతమైన నైపుణ్యాలు గల ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం కష్టమేనని.. అయితే, కెప్టెన్‌గా అతడు లేని లోటును గిల్‌ పూడ్చగలడని పేర్కొన్నాడు. 

అందుకే యువ క్రికెటర్‌ అయినప్పటికీ అతడిపై నమ్మకంతో గుజరాత్‌ టైటాన్స్‌ ఇంత పెద్ద బాధ్యతను గిల్‌కు అప్పగించిందని తెలిపాడు. ఫలితాలతో సంబంధం లేకుండా అతడికి తమ ప్రోత్సాహం ఉంటుందని ఆశిష్‌ నెహ్రా ఈ సందర్భంగా వెల్లడించాడు. కాగా ఐపీఎల్‌-2024 వేలానికి ముందు హార్దిక్‌ పాండ్యా టైటాన్స్‌కు షాకిచ్చిన విషయం తెలిసిందే.

ఊహించని విధంగా
తాను గతంలో ప్రాతినిథ్యం వహించిన ముంబై ఇండియన్స్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుని ట్రేడింగ్‌ ద్వారా సొంత గూటికి వెళ్లిపోయాడు. రోహిత్‌ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో.... తమ అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్‌ విజేతగా నిలపడంతో పాటు రెండో ఎడిషన్‌లో ఫైనల్‌ తీసుకువెళ్లిన పాండ్యా జట్టును వీడటంతో గుజరాత్‌ టైటాన్స్‌ శుబ్‌మన్‌ గిల్‌ను తమ నాయకుడిగా ప్రకటించింది.

హార్దిక్‌ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం.. అయితే గిల్‌..
ఈ విషయాల గురించి తొలిసారిగా స్పందించిన టైటాన్స్‌ హెడ్‌కోచ్‌ ఆశిష్‌ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘హార్దిక్‌ పాండ్యా వంటి ప్రతిభావంతుడైన, అనుభవం గల ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. అయితే, గత మూడు- నాలుగేళ్లలో గిల్‌ క్రికెటర్‌గా ఎదిగిన విధానం చూస్తూనే ఉన్నాం.

అతడి వయసు ప్రస్తుతం 24- 25 ఏళ్ల మధ్య ఉంటుంది. అయితే, ఈ యువ ఆటగాడి నైపుణ్యాలపై మాకు నమ్మకం ఉంది. అందుకే అతడిని కెప్టెన్‌ను చేశాం. ప్రతిసారి ఫలితాలను బట్టే ముందుకు సాగడం కుదరదు. కెప్టెన్‌గా ఉన్నపుడు జట్టును విజయవంతంగా ముందుకు నడపాల్సి ఉంటుందన్నది వాస్తవమే.

గిల్‌పై మాకు నమ్మకం ఉంది
అయితే, సారథిగా ఉన్నపుడు కేవలం ఫలితాల గురించి మాత్రమే ఆలోచించకుండా ఒక్కోసారి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. గిల్‌ అలాంటి వాడే. గుజరాత్‌ కెప్టెన్‌గా అతడు సరైన వాడని మేము నమ్ముతున్నాం’’ అని నెహ్రా పేర్కొన్నాడు.

స్టార్క్‌కు అంత మొత్తం పెట్టొచ్చు
ఇక ఐపీఎల్‌-2024 వేలంలో ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ కోసం తాము పోటీపడటాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఐపీఎల్‌లో అధిక ధర అన్న దానికి కొలమానం లేదు. స్టార్క్‌ ఎలాంటి బౌలరో అందరికీ తెలుసు. మాకు సమర్థవంతమైన ఫాస్ట్‌ బౌలర్‌ అవసరం ఉంది. జట్టు ప్రయోజనాలు, వ్యూహాలకు అనుగుణంగా అతడిని కొనుగోలు చేయాలని భావించాం.

అయితే, ఇప్పుడు మా దగ్గర ఉన్న పేస్‌ దళంతో మేము సంతృప్తిగానే ఉన్నాం. ఏదేమైనా స్టార్క్‌ వంటి బౌలర్‌కు అంత మొత్తం చెల్లించడం నన్నేమీ ఆశ్చర్యపరచలేదు’’ అని ఆశిష్‌ నెహ్రా చెప్పుకొచ్చాడు. కాగా మిచెల్‌ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఏకంగా రూ. 24.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌-2024 వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ కొనుగోలు చేసిన ఆటగాళ్ల జాబితా:
1. అజ్మతుల్లా ఒమర్జాయ్ (రూ.50 లక్షలు)
2. ఉమేశ్ యాదవ్ (రూ.5.8 కోట్లు)
3. షారూఖ్ ఖాన్ (రూ.7.4 కోట్లు)
4. సుశాంత్ మిశ్రా (రూ.2.2 కోట్లు)
5. కార్తీక్ త్యాగి (రూ.60 లక్షలు)
6. మానవ్ సుతార్ (రూ.20 లక్షలు)
7. రాబిన్ మింజ్ (రూ.3.6 కోట్లు)
8. స్పెన్సర్ జాన్సన్ (రూ.10 కోట్లు).

వేలానికి ముందు రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు:
అభినవ్ సదారంగని, బి.సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, డేవిడ్ మిల్లర్, జయంత్ యాదవ్, జాషువా లిటిల్, కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, ఆర్ సాయి కిషోర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, శుబ్‌మన్‌ గిల్ (కెప్టెన్), విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహా.

గుజరాత్‌ టైటాన్స్‌ రిలీజ్‌ చేసిన ఆటగాళ్లు:
అల్జారీ జోసెఫ్, దసున్ షనక, కోన శ్రీకర్‌ భరత్, ఒడియన్ స్మిత్, ప్రదీప్ సంగ్వాన్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, యశ్ దయాళ్.
ట్రేడ్‌ చేసిన ప్లేయర్‌: హార్దిక్‌ పాండ్యా(ముంబై ఇండియన్స్‌కు).

చదవండి: తండ్రిది పాన్‌ షాప్‌.. గ్లవ్స్‌ కొనేందుకు కూడా డబ్బులు లేవు! ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్లు 

>
మరిన్ని వార్తలు