'ఈ పని అప్పుడే చేయాల్సింది.. ఇప్పుడెందుకు'

17 Oct, 2020 15:44 IST|Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌ మధ్యలో దినేష్‌ కార్తీక్‌(డీకే) స్థానంలో ఇయాన్‌ మోర్గాన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించిన కేకేఆర్‌ యాజమాన్యం నిర్ణయాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ తప్పుబట్టాడు. సీజన్‌ మధ్యలో కేకేఆర్‌ కెప్టెన్‌ను మార్చడం వల్ల ఉపయోగం ఏంటని అభిప్రాయపడ్డాడు. స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో గంభీర్‌ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.

'ముంబైతో మ్యాచ్‌కు ముందు ఏడు మ్యాచ్‌లాడిన కేకేఆర్‌ నాలుగు విజయాలు, మూడు ఓటములతో నాలుగో స్థానంలో ఉంది.  కేవలం బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడానికే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు కార్తీక్‌ చెప్పిన సమాధానాన్ని నేను అంగీకరించను. క్రికెట్‌ అనేది ఎలాంటి రిలేషన్‌షిప్‌ కాదు. కేవలం ఆటగాళ్లు చేసే ప్రదర్శన, జట్టుగా విజయం సాధించాలనే తపన మాత్రమే టైటిల్‌ను గెలిచేలా చేస్తుంది. ఇప్పడు మోర్గాన్‌ అర్థంతరంగా బాధ్యతలు చేపట్టినంత మాత్రానా జట్టు పరిస్థితిని మార్చలేడు. ఈ పనిని లీగ్‌ ఆరంభంలోనే చేసి ఉంటే మోర్గాన్‌ జట్టును వేరే రకంగా ముందుకు తీసుకెళ్లేవాడు. కానీ ఇలా టోర్నీ మధ్యలో చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. (చదవండి :ఈ పేరుకు కొంచెం గౌరవం ఇవ్వండి : గేల్‌)

ముఖ్యంగా జట్టు కోచ్‌, కెప్టెన్ల మధ్య రిలేషన్‌షిప్‌ బాగుంటేనే మంచి ఫలితం వస్తుంది. 2018 నుంచి కేకేఆర్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కార్తీక్‌ రెండున్నర సంవత్సరాలు విజయవంతంగా నడిపించాడు. నిజానికి ఈ సీజన్‌లో కూడా కార్తీక్‌ కెప్టెన్సీలో కేకేఆర్‌ నాలుగో స్థానంలో ఉందంటే మరి చెడ్డ ప్రదర్శన అని మాత్రం చెప్పలేం. కానీ సీజన్‌ మధ్యలో కార్తీక్‌ ఇలా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది. కేవలం బ్యాటింగ్‌ కోసమే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నట్లు కార్తీక్‌ అంటున్నాడు.. కానీ ఒకవేళ యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక నాయకత్వ బాధ్యతలు నుంచి వైదొలిగితే మాత్రం కార్తీక్‌ది దురదృష్టమనే చెప్పొచ్చు' అని గంభీర్‌ చెప్పకొచ్చాడు.(చదవండి : కెప్టెన్సీకి దినేశ్‌ కార్తీక్‌ గుడ్‌ బై)

ఇక ఐపీఎల్‌లో శుక్రవారం కేకేఆర్ , ముంబై మధ్య జరిగిన పోరులో రోహిత్‌ సేన 8 వికెట్ల తేడాతో కోల్‌కతాను చిత్తు చేసింది. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కమిన్స్‌ (36 బంతుల్లో 53 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించాడు. మోర్గాన్‌ (29 బంతుల్లో 38 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్‌ 16.5 ఓవర్లలో 2 వికెట్లకు 149 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ డికాక్‌ (44 బంతుల్లో 78 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగాడు. 

మరిన్ని వార్తలు