కోహ్లి ప్రవర్తన నాకు చిన్న పిల్లాడిలా అనిపించింది

4 Mar, 2021 16:52 IST|Sakshi

అహ్మదాబాద్‌: మొటేరా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వాగ్వాదంలో కోహ్లి ప్రవర్తన నాకు చిన్న పిల్లాడిలా అనిపించిందని ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు గ్రేమ్‌ స్వాన్‌ తెలిపాడు. గొడవ జరిగిన సమయంలో మ్యాచ్‌ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న స్వాన్‌ పై వ్యాఖ్యలు చేశాడు.

'' కోహ్లి ప్రవర్తన నాకు నచ్చలేదు. సిరాజ్‌ను చూస్తూ అసహనం వ్యక్తం చేస్తూ నిలబడిన స్టోక్స్‌తో కోహ్లి మాటల యుద్దానికి తెరతీశాడు. బంతి వేసిన తర్వాత ఫీల్డర్లు యధాస్థానానికి వెళ్లిపోవాలి.. కానీ కోహ్లి అలా చేయలేదు. ఒక బౌలర్‌, బ్యాట్స్‌మన్‌ సంభాషణ మధ్యలో దూరడం సరికాదు. ఇదంతా చూస్తే కోహ్లి మనసత్త్వం చిన్న పిల్లాడిలా అనిపించింది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక విషయంలోకి వెళితే.. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన 12వ ఓవర్‌ మొదటి మూడు బంతుల్లో స్టోక్స్‌ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో సిరాజ్‌పై అసహనం వ్యక్తం చేసిన స్టోక్స్‌.. ఏదో అనబోయాడు. అయితే సిరాజ్‌ మాత్రం పెద్దగా స్పందించలేదు. కానీ కోహ్లి మాత్రం స్టోక్స్‌ బదులిచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. అయితే అంతలోనే అంపైర్లు నితిన్‌ మీనన్‌, వీరేందర్‌ శర్మ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు.. బెయిర్‌ స్టో మాత్రం నవ్వుతూనే స్టోక్స్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. మ్యాచ్‌ విషయానికి వస్తే ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్‌ అయింది. స్టోక్స్‌ 55 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 4 వికెట్లతో రాణించగా.. అశ్విన్‌ 3, సిరాజ్‌ 2, సుందర్‌ ఒక వికెట్‌ తీశాడు.
చదవండి: 
నాలుగో టెస్టు: కోహ్లి, స్టోక్స్‌ మధ్య వాగ్వాదం!
పంత్‌ ట్రోలింగ్‌.. వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

మరిన్ని వార్తలు