ప్రాగ్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ విజేత హరికృష్ణ

19 Jun, 2022 10:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెంటేల హరికృష్ణ చెక్‌ రిపబ్లిక్‌లో జరిగిన ప్రాగ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. 10 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో 36 ఏళ్ల హరికృష్ణ 6.5 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు.

డేవిడ్‌ ఆంటోన్‌ గిజారో (స్పెయిన్‌)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్‌ గేమ్‌లో హరికృష్ణ 57 ఎత్తుల్లో గెలిచి టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. ఈ టోర్నీలో హరికృష్ణ నాలుగు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. విజేతగా నిలిచిన హరికృష్ణకు 25 వేల చెక్‌ కొరూనాలు (రూ. 82 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

మరిన్ని వార్తలు