Wrestlers Protest: దేశం కోసం పతకం... పతకం కోసం సర్వస్వం: బజరంగ్‌ పూనియా

20 May, 2023 13:10 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ రెజ్లర్లు సాధించిన పతకాలకు వెలకట్టడంపై స్టార్ల రెజ్లర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెజ్లర్ల పతకాలు 15 రూపాయలు కూడా విలువ చేయవని, పతకాలు తిరిగివ్వడం కాదు... రూ.కోట్లలో పొందిన ప్రోత్సాహకాల్ని తిరిగివ్వాలని బీజేపీ ఎంపీ కూడా అయిన బ్రిజ్‌భూషణ్‌ అన్నారు. దీనిపై జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేస్తున్న ఒలింపిక్‌ మెడలిస్ట్‌ బజరంగ్‌ పూనియా మాట్లాడుతూ ‘ఆ పతకం ఛారిటీలో బ్రిజ్‌భూషణ్‌ ఇచ్చింది కాదు.

నేను దేశం కోసం శ్రమిస్తే వచ్చింది. దాని కోసం రాత్రనక పగలనక మా రక్తం ధారపోశాం. ఏళ్ల తరబడి చెమట చిందించాం. దానికి వెలకట్టే అర్హత అతనికి లేనేలేదు’ అని అన్నాడు. మరో రెజ్లర్‌ సాక్షి మలిక్‌ కూడా అంతేస్థాయిలో ధ్వజమెత్తింది. బ్రిజ్‌భూషణ్‌కు కనపడిన 15 రూపాయల పతకం కోసమే సర్వస్వాన్ని ధారపోశామని చెప్పింది. అతని వ్యాఖ్యలు సిగ్గుచేటని, క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించాలని సూచించింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజభూషణ్‌ను అరెస్టు చేయాలని రెజ్లర్లంతా నెలరోజులుగా నిరసన చేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు