The Hundred League: హ్యారీ బ్రూక్‌ ఊచకోత.. ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు

23 Aug, 2023 14:58 IST|Sakshi

హండ్రెడ్‌ లీగ్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదైంది. నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ ఆటగాడు, ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌ హ్యారీ బ్రూక్‌ ఈ ఫీట్‌ సాధించాడు. వెల్ష్‌ ఫైర్‌తో నిన్న (ఆగస్ట్‌ 22) జరిగిన మ్యాచ్‌లో బ్రూక్‌ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. హండ్రెడ్‌ లీగ్‌ హిస్టరీలోనే ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ. బ్రూక్‌ తన ఇన్నింగ్స్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు.

కేవలం ముగ్గురు మాత్రమే.. 
హండ్రెడ్‌ లీగ్‌లో చరిత్రలో (పురుషుల ఎడిషన్‌లో) ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే సెంచరీ మార్కును అందుకోగా.. బ్రూక్‌దే ఫాస్టెప్ట్‌ సెంచరీగా రికార్డైంది. 2022 సీజన్‌లో విల్‌ జాక్స్‌ (47 బంతుల్లో) (48 బంతుల్లో 108 నాటౌట్‌; 10 ఫోర్లు, 8 సిక్సర్లు), విల్‌ స్మీడ్‌ (49 బంతుల్లో) (50 బంతుల్లో 101 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలు చేయగా, బ్రూకే అతి తక్కువ బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. 

హండ్రెడ్‌ లీగ్‌లో అత్యధిక స్కోర్‌..
హండ్రెడ్‌ లీగ్‌లో బ్రూక్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసినప్పటికీ, ఈ లీగ్‌లో అత్యధిక స్కోర్‌ (ఏకైక సెంచరీ) రికార్డు మాత్రం మహిళా క్రికెటర్‌ పేరిట నమోదై ఉంది. ప్రస్తుత సీజన్‌లో వెల్ష్‌ ఫైర్‌ ప్లేయర్‌ ట్యామీ బేమౌంట్‌ ట్రెంట్‌ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసింది. ఓవరాల్‌గా హండ్రెడ్‌ లీగ్‌లో ఇదే అత్యుత్తమ స్కోర్‌గా రికార్డైంది.

బ్రూక్‌ సెంచరీ వృధా..
వెల్ష్‌ ఫైర్‌పై బ్రూక్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీతో విరుచుకుపడినా ప్రయోజనం లేకుండా పోయింది. అతను ప్రాతినిథ్యం వహించిన నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌.. వెల్ష్‌ ఫైర్‌ చేతిలో ఓటమిపాలై లీగ్‌ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ ఛార్జర్స్‌.. బ్రూక్‌ శతక్కొట్టడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సూపర్‌ ఛార్జర్స్‌ ఇన్నింగ్స్‌లో బ్రూక్‌ (మూడంకెల స్కోర్‌), ఆడమ్‌ హోస్‌ (15) మినహా మిగతావారు కనీసం రెండంకెల స్కోర్‌ కూడా చేయలేకపోయారు. వెల్ష్‌ ఫైర్‌ బౌలర్లలో డేవిడ్‌ విల్లీ 2, మ్యాట్‌ హెన్రీ, డేవిడ్‌ పెయిన్‌, వాన్‌ డర్‌ మెర్వ్‌, వెల్స్ తలో వికెట్‌ పడగొట్టారు.

విధ్వంసం సృష్టించిన వెల్ష్‌ ఫైర్‌ ప్లేయర్లు..
159 పరుగుల లక్ష్య ఛేదనలో వెల్ష్‌ ఫైర్‌ ప్లేయర్లు విధ్వంసం సృష్టించారు. స్టెఫెన్‌ ఎస్కినాజీ (28 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3  సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (39 బంతుల్లో 44; ఫోర్‌, 3 సిక్సర్లు), జో క్లార్క్‌ (22 బంతుల్లో 42 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి, తమ జట్టును 90 బంతుల్లోనే (2 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా వెల్ష్‌ ఫైర్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రూక్‌ విధ్వంసకర శతకం బూడిదలో పోసిన పన్నీరైంది. 

మరిన్ని వార్తలు