ICC T20 Rankings: అగ్రస్థానాన్ని చేజార్చుకున్న పాక్‌ కెప్టెన్‌..

15 Dec, 2021 18:57 IST|Sakshi

Babar Azam: టీ20 ప్రపంచకప్‌ 2021 తర్వాత వరుస వైఫల్యాల బాట పట్టిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబార్‌ ఆజమ్‌.. తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. బంగ్లాదేశ్‌, విండీస్‌లతో జరిగిన సిరీస్‌ల్లో దారుణంగా విఫలమైన బాబర్‌.. రెండు ర్యాంకులు దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. బాబర్‌.. బంగ్లాదేశ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 26 పరుగులు, విండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న  సిరీస్‌(2 మ్యాచ్‌లు)లో 8 పరుగులు మాత్రమే చేయడంతో అగ్రస్థానాన్ని చేజార్చుకున్నాడు. 

గత 5 మ్యాచ్‌ల్లో బాబార్‌ బ్యాటర్‌గా దారుణంగా విఫలమైనా పాక్‌ జట్టు మాత్రం ఐదింటిలోనూ గెలవడం విశేషం. వరుస వైఫల్యాలతో బాబర్‌ ర్యాంక్‌ పతనం కాగా.. ఇంగ్లండ్‌ డాషింగ్‌ ప్లేయర్‌ డేవిడ్‌ మలాన్‌ తిరిగి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. అతని తర్వాత రెండో ప్లేస్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ ఉన్నాడు. 


ఇదిలా ఉంటే, ఈ వారం ఐసీసీ విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటర్ల విభాగంలో లబూషేన్‌ రెండో స్థానానికి ఎగబాకగా, డేవిడ్‌ వార్నర్‌.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక బౌలర్ల విభాగానికి వస్తే.. టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో స్థానాన్ని పదిలం చేసుకోగా.. పాక్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది మూడో ప్లేస్‌కు ఎగబాకాడు. ఆసీస్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 
చదవండి: రిటైర్మెంట్‌పై స్పందించిన టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌..

>
మరిన్ని వార్తలు