పబ్‌జీ, టిక్‌టాక్‌ల పరిస్థితి ఏంటి.. చైనా యాప్‌లపై కేంద్రం క్లారిటీ

15 Dec, 2021 19:02 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనా యాప్‌లపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యాప్‌లపై విధించిన బ్యాన్‌ని వెనక్కి తీసుకునే ప్రతిపాదన ఏదీ మంత్రిత్వశాఖ వద్ద లేదని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. గతంలో నిషేధించిన చైనా అప్లికేషన్ల వినియోగాన్ని దేశంలో పునఃప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందా అనే ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

గత సంవత్సరం, భారతదేశంలో పబ్‌జీ, టిక్‌టాక్, వీబో, వీచాట్, అలీఎక్స్‌ప్రెస్‌తో సహా వందలాది చైనీస్ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. నవంబర్ 2020లో, కేంద్రం 43 మొబైల్ యాప్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేస్తూ ఐటీ చట్టంలోని సెక్షన్ 69 ఏ కింద ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, రాష్ట్ర భద్రత, ప్రజా శాంతి భద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. అంతకుముందు జూన్ 29, 2020న, భారతదేశం 59 మొబైల్ యాప్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేస్తూ సెప్టెంబర్ 2న ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద 118 యాప్‌లు నిషేధించింది.

చదవండి: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాసా..! తొలిసారిగా సూర్యుడి వాతావరణంలోకి..! అదెలా సాధ్యమైదంటే..?

మరిన్ని వార్తలు