IND VS AUS 3rd T20: అతడు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు.. ప్లాన్‌ వర్కౌట్‌ అవ్వలేదు: సూర్యకుమార్‌

29 Nov, 2023 09:34 IST|Sakshi

గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర శతకంతో (48 బంతుల్లో 104 నాటౌట్‌; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడి ఆసీస్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. రుతురాజ్‌ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్‌; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

అనంతరం లక్ష్యఛేదనలో మ్యాక్స్‌వెల్‌ విశ్వరూపం ప్రదర్శించి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కాగా మ్యాక్సీ, మాథ్యూ వేడ్‌ (16 బంతుల్లో 28 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) తలో చేయి వేసి ఆసీస్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో ఆసీస్‌ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్‌ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. 

మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. మ్యాక్స్‌వెల్‌ను త్వరగా ఔట్‌ చేయాలనుకున్న మా ప్లాన్‌ వర్కౌట్‌ అవ్వలేదు. అతడు మాపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. మంచులో 220 స్కోర్‌ను డిఫెండ్ చేయాలంటే, బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. ఈ విషయంలో కూడా మా ప్లాన్‌ ఫెయిల్‌ అయ్యింది. 

ఆస్ట్రేలియా మొదటి నుంచే గేమ్‌లో ఉండింది. ఆఖర్లో వారు మాపై పైచేయి సాధించారు. అక్షర్ అనుభవజ్ఞుడైన బౌలర్. మంచు అధికంగా కురుస్తున్నప్పుడు అనుభవజ్ఞుడైన బౌలర్‌ స్పిన్నర్‌ అయినా పేసర్‌ అయినా ఫలితం ఒకేలా ఉంటుంది. అందుకే 19వ ఓవర్‌ అక్షర్‌కు ఇచ్చా.  ఇది కూడా మిస్‌ ఫైర్‌ అయ్యింది. ఓడినప్పటికీ అబ్బాయిల ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉందని అన్నాడు.

మరిన్ని వార్తలు