IND VS BAN 1st Test: విరాట్‌ కోహ్లిని కాపాడిన రిషబ్‌ పంత్‌

17 Dec, 2022 14:47 IST|Sakshi

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది. రెండో ఇన్నింగ్స్‌ను 258 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసిన భారత్‌.. ప్రత్యర్ధి ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో బంగ్లాదేశ్‌ అద్భుతంగా పోరాడుతోంది. నాలుగో రోజు మూడో సెషన్‌ సమయానికి ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్‌ జాకిర్‌ హసన్‌ (100) అద్భుతమైన శతకంతో అజేయంగా కొనసాగుతుండగా.. మరో ఓపెనర్‌ నజ్ముల్‌ హొస్సేన్‌ శాంటో (67) అర్ధసెంచరీతో రాణించాడు. యాసిర్‌ అలీ (5), లిటన్‌ దాస్‌ (19) నిరాశ పరిచారు. జకీర్‌ హసన్‌కు జతగా ముష్ఫికర్‌ రహీం (16) క్రీజ్‌లో ఉన్నాడు.

ఇదిలా ఉంటే, బంగ్లా ఇన్నింగ్స్‌ 47వ ఓవర్‌లో వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ అందుకున్న ఓ అద్భుతమైన క్యాచ్‌ నాలుగో రోజు మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో నజ్ముల్‌  షాంటో ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌ ఉన్న విరాట్ చేతుల్లో పడ్డాక వదిలి పెట్టగా.. అప్పటికే అలర్ట్‌గా ఉన్న పంత్‌ చాకచక్యంగా క్యాచ్‌ను అందుకున్నాడు. ఫలితంగా బంగ్లాదేశ్‌ 124 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. విరాట్‌ను పంత్‌ కాపాడాడంటూ ఫ్యాన్స్‌ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యం అందుకున్న  భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (110), పుజారా (102 నాటౌట్‌) సెంచరీలతో రాణించారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకే ఆలౌట్‌ కాగా, బంగ్లాదేశ్‌ 150 పరుగులకే చాపచుట్టేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు