IND Vs ENG 1st Test Day 3: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 25/0

6 Aug, 2021 22:21 IST|Sakshi

► మ్యాచ్‌కు మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. డొమినిక్‌ సిబ్లీ 9, రోరీ బర్న్స్‌ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

► భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ టీ విరామ సమయానికి వికెట్‌ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ ఇంకా 84 పరుగులు వెనుకబడిఉంది. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 278 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మ్యాచ్‌లో మూడోరోజైన శుక్ర‌వారం ఓవ‌ర్‌నైట్ స్కోర్ 125/4తో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా మ‌రో 153 ప‌రుగులు చేసి ఆలౌటైంది. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ ( 84 ప‌రుగులు ), ర‌వీంద్ర జ‌డేజా ( 56 ప‌రుగులు) హాఫ్ సెంచ‌రీలు న‌మోదు చేశారు. చివ‌ర‌లో బుమ్రా ( 28 ప‌రుగులు) విలువైన ప‌రుగులు చేశాడు. దీంతో ఆతిథ్య జ‌ట్టు ఇంగ్లండ్‌పై 95 ప‌రుగుల భారీ ఆధిక్యం ల‌భించింది. ఇక ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో ఓలీ రాబిన్స‌న్ ఐదు వికెట్లు తీయ‌గా.. జేమ్స్ అండ‌ర్స‌న్ నాలుగు వికెట్లు తీశాడు.

జడేజా ఔట్‌.. 49 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
► టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అర్థ శతకం సాధించిన కాసేపటికే ఔటయ్యాడు. ఇన్నింగ్స్‌ 75 ఓవర్‌లో 81 బంతుల్లో అర్థ శతకం మార్క్‌ అందుకున్న జడేజా అదే ఓవర్లో రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో బ్రాడ్‌కు క్యాచ్‌ ఇచ్చిన జడేజా 56 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. టీమిండియా స్కోరు 79 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245గా ఉంది. ప్రస్తుతం భారత్‌ 49 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

► ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కేఎల్‌ రాహుల్‌ సెంచరీకి చేరువగా వచ్చి ఔటయ్యాడు. భారత ప్రధాన బ్యాట్స్‌మెన్‌ విఫలమైన చోట రాహుల్‌ మాత్రం నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 84 పరుగులు చేసిన రాహుల్‌ అండర్సన్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 6 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 32, శార్దూల్‌ ఠాకూర్‌(0) క్రీజులో ఉన్నారు. కాగా రాహుల్‌ వికెట్‌తో అండర్సన్‌(620) టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా  నిలిచాడు

► ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ ఆధిక్యంలోకి వచ్చింది. పంత్‌ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి రాహుల్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇద్దరి మధ్య 46 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. లంచ్‌ విరామం సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 77, రవీంద్ర జడేజా 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ 8 పరుగుల ఆధిక్యంలో ఉంది.

► ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 25 పరుగులు చేసిన పంత్‌ రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టోకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 52 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 62, జడేజా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నాటింగ్‌హమ్‌: భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడోరోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఔట్‌ఫీల్డ్‌ కాస్త తడిగా ఉండడంతో మ్యాచ్‌ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. టీమిండియా 4 వికెట్ల నష్టానికి126 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడోరోజు ఆటను ప్రారంభించింది. అయితే ఒక ఓవర్‌ పూర్తైన తర్వాత మళ్లీ వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం భారత్‌ 48.3  ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 58, పంత్‌ 13 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్సన్‌ 2, ఓలి రాబిన్‌సన్‌ ఒక వికెట్‌ తీశాడు. 

అంతకముందు భారత బౌలర్ల శుభారంభంతో మొదలైన తొలి టెస్టును వర్షం ఇబ్బంది పెడుతోంది. రెండో రోజు ఆడిన సమయం కంటే వాన పడిన సమయమే ఎక్కువ. దీంతో దాదాపు రెండు సెషన్ల ఆట జరగలేదు. ఆట సాగిన తొలి సెషన్‌లో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ (151 బంతుల్లో 57 బ్యాటింగ్‌; 9 ఫోర్లు) రాణించాడు. సీనియర్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (107 బంతుల్లో 36; 6 ఫోర్లు) మోస్తరు పరుగులు చేశాడు. వర్షంతో రెండో రోజు ఆటను రద్దు చేసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 46.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అండర్సన్‌ 2 వికెట్లు తీశాడు. 

మరిన్ని వార్తలు