IND VS SA 3rd ODI: శతక్కొట్టాక సంజూ సంబురాలు చూడండి..!

21 Dec, 2023 20:28 IST|Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుపెట్టి ఎనిమిది ఏళ్లు పూర్తయిన అనంతరం సంజూ శాంసన్‌ తన తొలి సెంచరీ సాధించాడు. 2015లో తొలిసారి టీమిండియాకు ఆడిన సంజూ (టీ20ల్లో) సుదీర్ఘ విరామం తర్వాత మూడంకెల మార్కును తాకాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్‌ 21) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో సంజూ తన తొలి అంతర్జాతీయ సెంచరీని బాది టీమిండియా అభిమానులకు క్రిస్మస్‌ కానుకను అందించాడు. 

సిరీస్‌ డిసైడర్‌లో క్లిష్టమైన పిచ్‌పై జట్టు కష్ట సమయంలో (49/2) ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. చాలా ఓపిగ్గా ఇన్నింగ్స్‌ను నిర్మించి సెంచరీ మార్కును చేరాడు. 110 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ 108 పరుగులు చేసి ఔటయ్యాడు. సెంచరీ అనంతరం సంజూ చేసుకున్న సంబురాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. 

సంజూ తన హెల్మెట్‌ను కింద పడేసి కండలు చూపిస్తూ సంబురాలు చేసుకున్న వైనం అందరినీ ఆకట్టుకుంది. సంజూతో పాటు స్టాండ్స్‌లో ఉన్న చహల్‌ సైతం అదే రేంజ్‌లో సంబురాలు చేసుకున్నాడు. సంజూ, చహల్‌ ఇద్దరూ ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడతారన్న విషయం తెలిసిందే.

సిరీస్‌ డిసైడర్‌లో సంజూ ఆడిన ఇన్నింగ్స్‌ భారత క్రికెట్‌ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత బ్యాటర్లు ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా మిగిలిపోతుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి కేరళ​ క్రికెటర్‌గా సంజూ చరిత్రలో నిలిచిపోతాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ (108) తన కెరీర్‌లో తొలి శతకంతో టీమిండియా ఈ స్థాయి స్కోర్‌ చేయడానికి పునాది వేయగా.. ఆఖర్లో రింకూ సింగ్‌ (38) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. తిలక్‌ వర్మ (52) సైతం బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ సాధించాడు. సౌతాఫ్రికా ఛేజింగ్‌ చేయాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు