Sakshi News home page

Sanju Samson: గర్వంగా ఉంది.. చాలా కష్టపడ్డాను! అతడొక అద్భుతం

Published Fri, Dec 22 2023 10:41 AM

Have Been Working Hard For All These Years: Sanju Samson - Sakshi

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 78 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. పార్ల్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్‌ సంజూ శాంసన్‌ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. బ్యాటింగ్‌కు కొంచెం కష్టంగా ఉన్న పిచ్‌పై సంజూ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.

ఈ మ్యాచ్‌లో 114 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో సంజూకు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన సంజూకు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ క్రమంలో  పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో శాంసన్‌ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

అదే విధంగా నా ప్రదర్శన పట్ల కూడా సంతృప్తిగా ఉన్నాను. గత కొంత కాలంగా నేను కష్టపడి పని చేస్తున్నాను. అందుకు తగ్గ ప్రతి ఫలం ఈరోజు దక్కింది. టీ20లతో పోలిస్తే వన్డే ఫార్మాట్‌లో పిచ్‌ను, బౌలర్‌ మైండ్‌సెట్‌ను అర్థం చేసుకోవడానికి మనకు కొంత సమయం ఉంటుంది.

అంతేకాకుండా బ్యాటింగ్‌కు టాపర్డర్‌లో వస్తే క్రీజులో సెటిల్‌ కావడానికి 10 నుంచి 20 బంతులు వరకు సమయం తీసుకోవచ్చు. ఇక తిలక్‌ వర్మ ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడి ఆటతీరు పట్ల దేశం మొత్తం గర్విస్తోంది. భవిష్యత్తులో అతడి నుంచి మరిన్ని మంచి ఇన్నింగ్స్‌లు వస్తాయి. సీనియర్లు భారత క్రికెట్ అత్యున్నత స్దాయికి తీసుకువెళ్లారు. ఇప్పుడు జూనియర్లు కూడా తమ పని తాము చేసుకుపోతున్నారు" అని చెప్పుకొచ్చాడు.

Advertisement

What’s your opinion

Advertisement