Ind vs SA: అతడి అరంగేట్రం ఖాయం.. నేనే వికెట్‌ కీపర్‌.. ఇక సంజూ: రాహుల్‌

16 Dec, 2023 20:35 IST|Sakshi
కేఎల్‌ రాహుల్‌- సంజూ శాంసన్‌ (PC: BCCI)

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రొటిస్‌తో తొలి మ్యాచ్‌లో తలపడే తుదిజట్టు కూర్పుపై సంకేతాలు ఇచ్చాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ స్థానమేమిటి? టీ20 స్టార్‌ రింకూ సింగ్‌ వన్డే అరంగేట్రం తదితర కీలకాంశాల గురించి అప్‌డేట్‌ ఇచ్చాడు.

కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా టీ20 జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. సూర్య సారథ్యంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ట్రోఫీని భారత్‌.. సౌతాఫ్రికాతో పంచుకుంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో టీమిండియా ఓడిపోయింది.

అయితే, నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో సూర్య సుడిగాలి శతకంతో జట్టును గెలిపించి సిరీస్‌ను సమం చేశాడు. ఈ క్రమంలో కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలో ఆదివారం (డిసెంబరు 17) నుంచి టీమిండియా వన్డే సిరీస్‌ను ఆరంభించనుంది. 

ఈ క్రమంలో జొహన్నస్‌బర్గ్‌ వేదికగా మొదలుకానున్న సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడాడు కేఎల్‌ రాహుల్‌. ఈ సందర్భంగా.. ‘‘సంజూ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తాడు. వన్డే క్రికెట్‌లో ఎప్పటిలాగే తన పాత్రను పోషిస్తాడు. ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు.

వికెట్‌ కీపర్‌గా నేనే వ్యవహరిస్తా. అయితే, ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే మాత్రం సిరీస్‌లో ఏదో ఒక మ్యాచ్‌లో సంజూ కీపర్‌గా బాధ్యతలు చేపడతాడు’’ అని రాహుల్‌ వెల్లడించాడు.

అదే విధంగా రింకూ సింగ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘అతడు అద్భుతమైన ప్లేయర్‌. ఐపీఎల్‌లో తన ప్రదర్శన ఎలా ఉందో అందరం చూశాం. అయితే, అంతకంటే ముఖ్యంగా సౌతాఫ్రికాలో టీ20 సిరీస్‌లో అతడు రాణించిన తీరు అద్భుతం. 

ఒత్తిడిలోనూ కూల్‌గా ఎలా ఆడాలో తనకు తెలుసు. దేశవాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో ఆడిన అనుభవం తనకు ఉంది. కాబట్టి తనకు కచ్చితంగా ఈ వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం ఉంటుంది’’ అని రింకూ వన్డే అరంగేట్రం గురించి రాహుల్‌ స్పష్టతనిచ్చాడు.

>
మరిన్ని వార్తలు