IND Vs SL 1st T20: వరుణుడి ఆటంకం తప్పదా..? 

25 Jul, 2021 18:13 IST|Sakshi

కొలంబో: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న తొలి టీ20కి వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ ప్రారంభ సమాయానికి వర్షం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా, మధ్యలో మాత్రం ఆటంకం కలిగించే ఆస్కారముందని సమాచారమందుతోంది. కొలొంబోలో గత కొద్ది రోజులుగా సాయంత్రం వేళల్లో వర్షం కురుస్తుండడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ వార్త ఇరు జట్ల అభిమానులను కలవరపెడుతుంది. వరుణుడి ఆటంకం లేకుండా 20 ఓవర్ల పాటు మ్యాచ్‌ సజావుగా సాగాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 

ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ ముందు జరుగుతున్న ఆఖరి సిరీస్ కావడంతో ఇరు జట్లు ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఆఖరి వన్డేలో 6 మార్పులు చేసి మూల్యం చెల్లించుకున్న భారత్.. ఈ మ్యాచ్‌లో పకడ్బందీగా బరిలోకి దిగనుంది. ఓపెనర్లుగా శిఖర్ ధవన్, పృథ్వీ షా బరిలోకి దిగనుండగా, వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమైన మనీశ్ పాండే స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కనుంది. మరోవైపు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్నర్‌ కోటాలో చహల్‌ను ఆడిస్తారా? లేక రాహుల్ చాహర్‌కు అవకాశమిస్తారా? అనేది చివరి నిమిషంలో తేలనుంది. ఇక ప్రధాన పేసర్లుగా దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ జట్టులోకి తిరిగిరానుండగా వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ అరంగేట్రం ఖాయమేనని తెలుస్తోంది. 

మరోవైపు తొలి రెండు వన్డేల్లో ఓడిన శ్రీలంక.. ఆఖరి మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది. సొంతగడ్డపై భారత్ చేతిలో 10 ఓటముల తర్వాత గెలుపొందింది. ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంలో తొలి టీ20 బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌కు దూరమైన హసరంగా ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలున్నాయి. హసరంగా జట్టులోకి వస్తే జయవిక్రమ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. టీ20 స్పెషలిస్ట్ అయిన ఇసురు ఉడానాకు కూడా చోటు దక్కే అవకాశాలున్నాయి. మూడో వన్డేలో ఆల్‌రౌండ్ షో కనబర్చిన లంక జట్టు తొలి టీ20లోనూ అదే తరహాలో రాణించాలని ఆశిస్తోంది.

తుది జట్లు: (అంచనా)
భారత్: పృథ్వీ షా, శిఖర్ ధవన్(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, చహల్/రాహుల్ చాహర్

శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), భానుక రాజపక్స, ధనుంజయ డి సిల్వా, చరిత అసలంక, డసన్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, వానిందు హసరంగ/ ప్రవీణ్ జయవిక్రమ, ఇసురు ఉడానా, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ

మరిన్ని వార్తలు