జింబాబ్వేకు షాక్‌.. మరో పసికూన చేతిలో ఘోర పరాభవం

31 Oct, 2023 12:47 IST|Sakshi

ఐసీసీ సభ్య దేశమైన జింబాబ్వేకు ఊహించని పరాభవం ఎదురైంది. తమ కంటే చిన్న జట్టైన నమీబియా చేతిలో టీ20 సిరీస్‌ కోల్పోయింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నమీబియా.. మూడుసార్లు వన్డే ప్రపంచకప్‌ ఆడిన జింబాబ్వేను ఓడించి సంచలన సృష్టించింది.

5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను నమీబియా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో నమీబియన్లు 8 పరుగులు తేడాతో గెలుపొందారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా 18.4 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్‌ కాగా.. జింబాబ్వే 19.2 ఓవర్లలో 93 పరుగులకు చాపచుట్టేసి పరాజయంపాలైంది. 

రాణించిన సికందర్‌ రజా..
ఇటీవలికాలంలో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న సికందర్‌ రజా (జింబాబ్వే) నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో బంతితో మెరిశాడు. రజా 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి నమీబియా పతనాన్ని శాశించాడు. రజాతో పాటు చటారా (3/7), నగరవ (2/6), ర్యాన్‌ బర్ల్‌ (1/33) కూడా రాణించడంతో నమీబియా 101 పరుగులకే చాపచుట్టేసింది. 

బ్యాటింగ్‌లో తేలిపోయిన జింబాబ్వే..
102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే ఆది నుంచే తడబుడతూ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 93 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లు బెర్నార్డ్‌, స్మిట్‌ చెరో 3 వికెట్లు.. లుంగమెని, ఎరాస్మస్‌, ఫ్రైలింక్‌ తలో వికెట్‌ తీసి జింబాబ్వేను మట్టికరిపించారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో లూక్‌ జాంగ్వే (24) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టీ20 గెలిచిన నమీబియా ఆతర్వాత నాలుగు, ఐదు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ చేజిక్కించుకుంది.

మరిన్ని వార్తలు