Asian Games 2023 Ind Vs SL: బోణీలోనే బంగారం

26 Sep, 2023 06:01 IST|Sakshi
స్వర్ణ పతకాలతో భారత మహిళా క్రికెటర్లు

భారత మహిళల క్రికెట్‌ జట్టుకు స్వర్ణ పతకం

ఫైనల్లో శ్రీలంకపై విజయం  

హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో గతంలో రెండుసార్లు (2010, 2014) మాత్రమే క్రికెట్‌ క్రీడాంశంగా ఉంది. అయితే ఆ రెండుసార్లూ భారత క్రికెట్‌ జట్లు బరిలోకి దిగలేదు. దాంతో మహిళల విభాగంలో పాకిస్తాన్‌ రెండుసార్లు స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో బంగ్లాదేశ్‌ (2010), శ్రీలంక (2014) ఒక్కోసారి బంగారు పతకం గెల్చుకున్నాయి. మూడోసారి మాత్రం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకొని ఆసియా క్రీడల్లో భారత జట్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది.

బీసీసీఐ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భారత మహిళల జట్టు బరిలోకి దిగిన తొలిసారే బంగారు పతకాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. టి20 ఫార్మాట్‌లో జరిగిన ఈ పోటీల్లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని భారత మహిళల జట్టు చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 19 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్‌ల నిషేధం ముగియడంతో ఫైనల్లో రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలో భారత్‌ పోటీపడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించింది. స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బారెడ్డి అనూష సభ్యురాలిగా ఉంది. అయితే ఆమెకు మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు.  

టిటాస్‌ సాధు కట్టడి...
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్‌), జెమీమా రోడ్రిగ్స్‌ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత టీనేజ్‌ పేస్‌ బౌలర్‌ టిటాస్‌ సాధు 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది. మరోవైపు బంగ్లాదేశ్‌ జట్టుకు కాంస్య పతకం
లభించింది. కాంస్య పతక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది.  

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: స్మృతి మంధాన (సి) ప్రబోధని (బి) రణవీర 46; షఫాలీ వర్మ (స్టంప్డ్‌) సంజీవని (బి) సుగంధిక 9; జెమీమా (సి) విష్మీ (బి) ప్రబోధని 42; రిచా ఘోష్‌ (సి) సంజీవని (బి) రణవీర 9; హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (సి) సంజీవని (బి) ప్రబోధని 2; పూజ వస్త్రకర్‌ (సి) విష్మీ (బి) సుగంధిక 2; దీప్తి శర్మ (నాటౌట్‌) 1; అమన్‌జోత్‌ కౌర్‌ (రనౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 116.
వికెట్ల పతనం: 1–16, 2–89, 3–102, 4–105, 5–108, 6–114, 7–116.
బౌలింగ్‌: ఒషాది 2–0–11–0, ఉదేశిక ప్రబోధని 3–0–16–2, ఇనోషి 3–1–11–0, సుగంధిక 4–0–30–2, చమరి ఆటపట్టు 2.5–0–19–0, కవిశ 1.1–0–7–0, ఇనోక రణవీర 4–0–21–2.

శ్రీలంక ఇన్నింగ్స్‌: చమరి ఆటపట్టు (సి) దీప్తి (బి) టిటాస్‌ సాధు 12; అనుష్క సంజీవని (సి) హర్మన్‌ (బి) టిటాస్‌ సాధు 1; విష్మీ (బి) టిటాస్‌ సాధు 0; హాసిని పెరీరా (సి) పూజ (బి) రాజేశ్వరి 25; నీలాక్షి (బి) పూజ 23; ఒషాది (సి) టిటాస్‌ సాధు (బి) దీప్తి 19; కవిశ (సి) రిచా (బి) దేవిక 5; సుగంధిక (స్టంప్డ్‌) రిచా (బి) రాజేశ్వరి 5; ఇనోషి (నాటౌట్‌) 1; ఉదేశిక ప్రబోధని (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 97.
వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–50, 5–78, 6–86, 7–92, 8–96.
బౌలింగ్‌: దీప్తి శర్మ 4–0–25–1, పూజ 4–1–20–1, టిటాస్‌ సాధు 4–1–6–3, రాజేశ్వరి 3–0–20–2, అమన్‌జోత్‌ కౌర్‌ 1–0–6–0, దేవిక వైద్య 4–0–15–1.  

ఆసియా క్రీడల్లో సోమవారం భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జాతీయ గీతం రెండుసార్లు మోగింది. షూటింగ్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో... మహిళల క్రికెట్‌లో టీమిండియా స్వర్ణ పతకాలతో సత్తా చాటుకుంది. భారత్‌కు షూటింగ్‌లోనే రెండు కాంస్యాలు, రోయింగ్‌లో మరో రెండు కాంస్యాలు లభించాయి. ఓవరాల్‌గా రెండోరోజు భారత్‌ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. ఈ మూడు క్రీడాంశాల్లో మినహా ఇతర ఈవెంట్స్‌లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు.   

మరిన్ని వార్తలు