Ind VS SL 3rd T20: భారీ స్కోర్లు గ్యారంటీ! అతడికి ఉద్వాసన.. రుతురాజ్‌ ఎంట్రీ!

7 Jan, 2023 10:29 IST|Sakshi

India vs Sri Lanka, 3rd T20I: టీమిండియా- శ్రీలంక మధ్య సిరీస్‌ విజేతను తేల్చే మూడో టీ20 శనివారం జరుగనుంది. గత మ్యాచ్‌ లోపాలు సరిదిద్దుకుని ఎలాగైనా సిరీస్‌ చేజిక్కించుకోవాలని  హార్దిక్‌ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో తృటిలో గెలుపును చేజార్చుకున్నా లంకేయులు.. రెండో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సిరీస్‌ను 1-1తో సమం చేసి పొట్టి ఫార్మాట్లో తమ సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకున్నారు.

భారత గడ్డపై ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌కోట్‌ మ్యాచ్‌ మరింత రసవత్తరంగా మారింది. హోరాహోరీ పోరుకు ఆతిథ్య, పర్యాటక జట్లు సై అంటే సై అంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైన ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ను తుది జట్టులో ఆడించే ఛాన్స్‌ ఉంది.

గిల్‌ అవుట్‌!?
లంకతో తొలి టీ20 మ్యాచ్‌లో వాంఖడేలో అరంగేట్రం చేసిన గిల్‌ 7 పరుగులు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రెండో మ్యాచ్‌లో కేవలం 5 రన్స్‌ మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలో దేశవాళీ టోర్నీల్లో అదరగొట్టిన రుతుతో అతడి స్థానం భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. 

కాగా ఈ ఏడాది విజయ్‌ హజారే ట్రోఫీ(వన్డే టోర్నీ)లో మహారాష్ట్ర సారథి రుతురాజ్‌ 5 మ్యాచ్‌లలో 660 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు,  ఓ డబుల్‌ సెంచరీ ఉంది. అత్యధిక స్కోరు: 220 నాటౌట్‌. ఇక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ఆరు మ్యాచ్‌లలో 283 పరుగులు సాధించాడు.

ఇదిలా ఉంటే రెండో టీ20లో చెత్త బౌలింగ్‌తో విమర్శలు మూటగట్టుకున్న అర్ష్‌దీప్‌ స్థానంలో ముఖేశ్‌ కుమార్‌ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మరోవైపు.. లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ యజేంద్ర చహల్‌ స్థానంలో స్పిన్‌ యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

తుది జట్లు (అంచనా) 
భారత్‌: హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, రుతురాజ్‌ గైక్వాడ్‌/శుబ్‌మన్‌ గిల్, సూర్యకుమార్ యాదవ్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, అక్షర్‌ పటేల్, వాషింగ్టన్‌ సుందర్‌/చహల్, ముఖేశ్‌ కుమార్‌/అర్ష్‌దీప్‌, శివమ్‌ మావి, ఉమ్రాన్‌ మాలిక్‌. 

శ్రీలంక: దసున్‌ షనక (కెప్టెన్‌), పాతుమ్‌ నిసాంక, కుశాల్‌ మెండిస్, చరిత్‌ అసలంక, భనుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్‌ తీక్షణ, దిల్షాన్‌ మదుషంక, కసున్‌ రజిత. 

పిచ్‌–వాతావరణం 
బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన వికెట్‌ ఇది. కాబట్టి ప్రేక్షకులకు మెరుపుల విందు, మ్యాచ్‌లో భారీ స్కోర్లు గ్యారంటీ. టాస్‌ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది. వర్షం ముప్పు లేదు.    

చదవండి: అర్షదీప్‌ను ఇక్కడ ప్రాక్టీస్‌ చేయించండి.. నో బాల్స్‌ ఎలా వేస్తాడో చూద్దాం..!
PAK Vs NZ: ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. చివరికి పాక్‌- కివీస్‌ మ్యాచ్‌ ఏమైందంటే?

మరిన్ని వార్తలు