Shivam Mavi: అరంగేట్రంలోనే దుమ్మురేపిన మావి.. మూడో భారత బౌలర్‌గా రికార్డు! అరుదైన జాబితాలో..

4 Jan, 2023 12:00 IST|Sakshi
శివం మావిని అభినందిస్తున్న కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా

India vs Sri Lanka, 1st T20I- Shivam Mavi: అరంగేట్రంలోనే దుమ్ములేపాడు టీమిండియా యువ ఫాస్ట్‌ బౌలర్‌ శివం మావి. శ్రీలంకతో స్వదేశంలో టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ రైట్‌ ఆర్మ్‌ పేసర్‌.. తొలి మ్యాచ్‌లోనే ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. లంక ఓపెనర్‌ పాతుమ్‌ నిసాంక(1), వన్‌డౌన్‌ బ్యాటర్‌ ధనంజయ డి సిల్వా(8) సహా స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ(21), మహీశ్‌ తీక్షణ(1)లను పెవిలియన్‌కు పంపాడు.

నమ్మకం నిలబెట్టుకుని
బంతిని తన చేతికి ఇచ్చిన తొలి ఓవర్‌లోనే కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఐదో బంతికి నిసాంకను బౌల్డ్‌ చేసిన మావి.. మిగతా మూడు వికెట్లు కూల్చే క్రమంలోనూ తడబడలేదు. మొత్తంగా తన నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన మావి.. కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. దీంతో శివం మావిపై ప్రశంసలు కురుస్తున్నాయి.


హుడా, మావి, చహల్‌

అరుదైన జాబితాలో
అరంగేట్రంలోనే ఈ మేరకు అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ 24 ఏళ్ల యూపీ క్రికెటర్‌.. ఈ సందర్భంగా ఓ అరుదైన ఘనత కూడా సాధించాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో ప్రజ్ఞాన్‌ ఓజా, బరీందర్‌ సరన్‌ ఈ ఫీట్‌ నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగుల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. 

అరంగేట్రంలోనే 4 వికెట్లు కూల్చిన భారత బౌలర్లు
1. ప్రజ్ఞాన్‌ ఓజా- 2009లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో- 21/4
2. బరీందర్‌ సరన్‌- 2016లో జింబాబ్వేతో మ్యాచ్‌లో- 10/4
3. శివం మావి- 2022లో శ్రీలంకతో మ్యాచ్‌లో- 22/4.
ఇక ఈ ముగ్గురిలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా బరీందర్‌ నిలిచాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో అతడు 10 పరుగుల మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.

చదవండి: Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ..
Umran Malik: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్‌ మాలిక్‌.. త్వరలోనే అక్తర్‌ను కూడా!

మరిన్ని వార్తలు