IND VS WI: రెండో వన్డేకు ప్రత్యేక అతిథులు.. సీనియర్లను ఉత్సాహపరిచిన జగజ్జేతలు

9 Feb, 2022 20:48 IST|Sakshi

Under 19 World Cup Winners Spotted At Narendra Modi Stadium: భారత్‌-విండీస్‌ జట్ల మధ్య అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న రెండో వన్డేకు ప్రత్యేక అతిధులు వచ్చారు. అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతలైన యువ భారత జట్టు సభ్యులు బుధవారం నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. సీనియర్ల ఆటను వీక్షించేందుకు బీసీసీఐ వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించింది. జగజ్జేతలతో పాటు జట్టు కోచ్ హృషికేశ్‌ కనిత్కర్‌, ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ కార్యదర్శి జై షాలు స్టేడియంలో కాసేపు మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేశారు. 


టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో బౌండరీలు వచ్చినప్పుడు వీరు జాతీయ పతాకాన్ని ఊపుతూ ఉత్సాహంగా కనిపించారు. అనంతరం బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రపంచకప్‌ విజేతలైన యంగ్‌ ఇండియా సభ్యులకు బీసీసీఐ సన్మానం చేసింది. కాగా, ఆంటిగ్వా వేదికగా జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ 2022 ఫైనల్లో యశ్‌ ధుల్‌ నేతృత్వంలోని యంగ్‌ ఇండియా.. 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ఐదో సారి జగజ్జేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే, విండీస్‌తో రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌(64), కేఎల్‌ రాహుల్‌(49) రాణించగా.. మిగతా భారత  ఆటగాళ్లు నిరాశపరిచారు. విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌, ఓడియన్‌ స్మిత్‌ చెరో 2 వికెట్లు, కీమర్‌ రోచ్‌, జేసన్‌ హోల్డర్‌, అకీల్‌ హొసేన్‌, ఫేబియన్‌ అలెన్‌లు తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం ఛేదనలో విండీస్‌ తడబడుతుంది. 38 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 156 పరుగలు చేసింది. విండీస్‌ గెలుపుకు 72 బంతుల్లో 82 పరుగులు చేయాల్సి ఉంది. 
చదవండి: 9.25 కోట్లు వెచ్చించారు.. కానీ, ఒక్క మ్యాచ్‌ కూడా ఆడించలేదు..!

మరిన్ని వార్తలు