ప్రపంచకప్‌లో నేడు రెండో సెమీఫైనల్‌.. ఆసీస్‌తో సౌతాఫ్రికా 'ఢీ'

16 Nov, 2023 03:13 IST|Sakshi

ఫైనల్లో స్థానం కోసం దక్షిణాఫ్రికా ఐదో ప్రయత్నం

నేడు ఆస్ట్రేలియాతో రెండో సెమీఫైనల్లో ‘ఢీ’

మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రసారం

కోల్‌కతా: ఫైనల్‌ను తలపించే సెమీఫైనల్‌ పోరుకు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా సిద్ధమయ్యాయి. రెండు సమఉజ్జీ జట్ల మధ్య జరిగే ఈ రెండో సెమీఫైనల్‌ కడదాకా ఆసక్తికరంగా జరగడం ఖాయం. తరాలు మారినా హేమాహేమీలతో సరితూగిన సఫారీ జట్టు ప్రపంచకప్‌లో మాత్రం చోకర్స్‌గానే  మిగిలింది. గతంలో దక్షిణాఫ్రికా ఈ మెగా ఈవెంట్‌లో నాలుగుసార్లు (1992, 1999, 2007, 2015) సెమీఫైనల్లోకి ప్రవేశించి ఆ అడ్డంకిని దాటలేకపోయింది.

ఐదో ప్రయత్నంలోనైనా తొలిసారి ఫైనల్‌ చేరాలనే లక్ష్యంతో బవుమా సేన బరిలోకి దిగుతోంది. జట్టు కూడా జోరుమీదుంది. ఓపెనింగ్, మిడిలార్డర్‌ అందరూ భారీ స్కోర్లలో భాగమవుతున్నారు. పైగా ఈ టోర్నీలో గట్టి ప్రత్యర్థులపై ఐదుసార్లు 300 పైచిలుకు స్కోర్లను అవలీలగా చేసిన జట్టేదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికానే! ఒక్క భారత్‌ తప్ప సెమీస్‌ చేరిన న్యూజిలాండ్, ఆ్రస్టేలియాలపై తమ భారీస్కోర్ల తడాఖా చూపింది.

డికాక్, డసెన్, మార్క్‌ రమ్, క్లాసెన్, మిల్లర్‌ అందరూ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో రబడ కంటే కొయెట్జీ ప్రమాదకరంగా మారాడు. ఎన్‌గిడి, కేశవ్‌ మహరాజ్‌లతో దక్షిణాఫ్రికా పటిష్టంగా ఉంది. మరోవైపు ఐదుసార్లు జగజ్జేత ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను ఆరంభించిన తీరు, తర్వాత మారిన విధానం, దూసుకొచ్చి న వైనం ఈ ఈవెంట్‌లో ఏ జట్టుకు సాధ్యం కాదేమో! ప్రొఫెషనలిజానికి మారుపేరైన ఆసీస్‌ టోర్నీ సాగేకొద్దీ దుర్బేధ్యంగా మారింది. వార్నర్, మార్‌‡్ష, లబుషేన్, స్మిత్‌లు రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం.

అఫ్గానిస్తాన్‌తో వీరోచిత డబుల్‌ సెంచరీతో జట్టును గెలిపించిన మ్యాక్స్‌వెల్‌ గాయంతో తదుపరి బంగ్లాదేశ్‌లో ఆడలేకపోయాడు. అయితే కీలకమైన ఈ సెమీస్‌లో అతను బరిలోకి దిగుతాడని, ఫిట్‌నెస్‌తో ఉన్నాడని కెప్టెన్‌ కమిన్స్‌ వెల్లడించాడు.  దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది. గురువారం మ్యాచ్‌ పూర్తికాకపోతే రిజర్వ్‌ డే శుక్రవారం కొనసాగిస్తారు. రెండు రోజుల్లోనూ ఫలితం రాకపోతే టోర్నీ లీగ్‌దశలో మెరుగైన స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది.  

మరిన్ని వార్తలు