IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. టీమిం‍డియా అత్యంత చెత్త రికార్డు!

29 Sep, 2022 10:54 IST|Sakshi

తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ప్రోటీస్‌ జట్టు.. భారత్‌ బౌలర్లు విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో ఆర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు వికెట్లు పడగొట్టి సఫారీల పతనాన్ని శాసించగా.. దీపక్ చహర్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.

అక్షర్ పటేల్ కు ఒక వికెట్ లభించింది.  ప్రోటీస్‌ బ్యాటర్లలో కేశవ్ మహరాజ్(41) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 107 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. అయితే స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్‌ ఆరంభంలో కాస్త తడబడింది. వరుస క్రమంలో రోహిత్‌ , విరాట్‌ వికెట్‌లను టీమిండియా కోల్పోయింది. అనంతరం రాహుల్‌(51 నాటౌట్‌), సూర్యకుమార్‌ యాదవ్‌(50 నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా టీమిండియా విజయాన్ని లాంఛనం చేశారు.

ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించినప్పటికీ ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. పిచ్‌ పేసర్లకు సహకరించడంతో టీమిండియా పవర్‌ ప్లేలో వికెట్‌ నష్టానికి 17 పరుగులు మాత్రమే చేసింది.  ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యల్ప పవర్‌ ప్లే స్కోర్‌ కావడం గమనార్హం.

అంతకుముందు 2016 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పవర్‌ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయి 21 పరుగులు చేసింది. ఇదే తాజా మ్యాచ్‌కు ముందువరకు ఇదే పవర్‌ ప్లే అత్యల్ప స్కోర్‌గా ఉండేది.
చదవండి: PAK vs ENG: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై పాక్‌ విజయం

మరిన్ని వార్తలు