2036 ఒలింపిక్స్‌కు భారత్‌ బిడ్‌ వేయాలి: పీటీ ఉష

9 Oct, 2023 03:47 IST|Sakshi

హాంగ్జౌ: ఆసియా క్రీడల చరిత్రలోనే భారత క్రీడా బృందం ఈసారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, అత్యధికంగా 107 పతకాలు సాధించడంపట్ల భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష ఆనందం వ్యక్తం చేసింది. ‘ఆసియా క్రీడల్లో రికార్డుస్థాయి ప్రదర్శన తర్వాత భారత క్రీడాకారులు వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌పై దృష్టి సారించాలి.

మన క్రీడాకారులు, కోచ్‌లు, జాతీయ క్రీడా సమాఖ్యలు శ్రమిస్తే పారిస్‌ ఒలింపిక్స్‌లో మన పతకాల సంఖ్య కచ్చితంగా రెండంకెలు దాటుతుంది. ఇక మనం కూడా ఒలింపిక్స్‌ ఆతిథ్యం కోసం బిడ్‌ వేయాల్సిన సమయం ఆసన్నమైంది. 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కుల కోసం భారత్‌ పోటీపడాలి’ అని 59 ఏళ్ల పీటీ ఉష వ్యాఖ్యానించింది. కేవలం ఒకట్రెండు క్రీడాంశాల్లో కాకుండా వేర్వేరు క్రీడాంశాల్లో భారత్‌కు పతకాలు రావడంపట్ల రాజ్యసభ సభ్యురాలైన ఉష ఆనందాన్ని వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు