లెక్క సరిచేశారు..

17 Feb, 2021 00:26 IST|Sakshi
లారెన్స్‌ను స్టంపౌట్‌ చేస్తున్న పంత్‌

రెండో టెస్టులో 317 పరుగులతో భారత్‌ ఘన విజయం

ఇంగ్లండ్‌ 164 ఆలౌట్‌ 

అక్షర్‌ పటేల్‌కు 5 వికెట్లు  

24నుంచి అహ్మదాబాద్‌లో మూడో టెస్టు

చెన్నైలో లాంఛనం ముగిసింది... ఎలాంటి ప్రతిఘటన, పోటీ లేకుండా ఇంగ్లండ్‌ తలవంచడంతో టెస్టు సిరీస్‌ 1–1తో సమమైంది. అనూహ్య ఓటమి అనంతరం సరిగ్గా వారం రోజులకు టీమిండియా విజేత స్థానంలో నిలవగా, ఈ సారి ఓటమి పర్యాటక జట్టు పక్షాన చేరింది. మిగిలిన ఏడు ఇంగ్లండ్‌ వికెట్లను పడగొట్టేందుకు భారత్‌కు 35.2 ఓవర్లే సరిపోగా... లంచ్‌ తర్వాత అర గంట లోపే ఆట ముగిసిపోయింది. తొలి టెస్టు ఆడిన అక్షర్‌ ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. చాలా కాలం తర్వాత సొంత ప్రేక్షకుల మధ్య సంబరాలు చేసుకున్న కోహ్లి సేన, అహ్మదాబాద్‌లో జరిగే ‘పింక్‌ టెస్టు’ సవాల్‌కు మరింత ఉత్సాహంతో సిద్ధమైంది.

చెన్నై: ఊహించినట్లుగానే ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు భారత్‌ వశమైంది. నాలుగో రోజే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 317 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 53/3తో మంగళవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌటైంది. మొయిన్‌ అలీ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, జో రూట్‌ (33) కొద్దిగా పోరాడాడు. అక్షర్‌ పటేల్‌ 60 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా...అశ్విన్‌ 3, కుల్దీప్‌ 2 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో పాటు మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. 

టపటపా... 
ఇంగ్లండ్‌ పతనం మరోసారి అశ్విన్‌ మాయతోనే మొదలైంది. నాలుగో రోజు ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య బౌలింగ్‌కు దిగిన అశ్విన్‌ తన తొలి బంతికే లారెన్స్‌ (26)ను అవుట్‌ చేశాడు. పంత్‌ అద్భుత స్టంపింగ్‌ ఈ వికెట్‌ దక్కేందుకు ఉపకరించింది. ఆ తర్వాత వచ్చిన స్టోక్స్‌ (8) కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో 38 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్‌ ఒకే ఒక సింగిల్‌ తీసి చివరకు అశ్విన్‌ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. పోప్‌ (12)ను అక్షర్‌ అవుట్‌ చేయగా, ఒకే స్కోరు వద్ద ఫోక్స్‌ (2), రూట్‌ వెనుదిరగడంతో ఇంగ్లండ్‌ ఆశలు కోల్పోయింది. అయితే చివర్లో అలీ కొన్ని మెరుపులు చూపించాడు.

కుల్దీప్‌ ఓవర్లో సిక్స్, ఫోర్‌ కొట్టిన అతను అక్షర్‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. ఆ తర్వాత అశ్విన్‌ బౌలింగ్‌లోనూ అతను వరుస బంతుల్లో 4, 6 కొట్టాడు. చివరకు కుల్దీప్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన అలీని పంత్‌ స్టంపౌంట్‌ చేయడంతో భారత్‌ విజయం ఖాయమైంది. అయితే అలీ మిగిలిన రెండు టెస్టులకు దూరమవుతున్నాడు. కుటుంబంతో గడిపేందుకు అతను స్వదేశానికి తిరిగి వెళుతున్నాడు. శ్రీలంకలో కరోనా బారిన పడిన అలీ, ఐపీఎల్‌ వేలంలో ఎంపికైతే వరుసగా దాదాపు ఐదు నెలలు ఇంటికి దూరంగా ఉన్నట్లవుతుంది.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 329, ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 134, భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 286, ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (సి) కోహ్లి (బి) అశ్విన్‌ 25, సిబ్లీ (ఎల్బీ) (బి) అక్షర్‌ 3, లారెన్స్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అశ్విన్‌ 26, లీచ్‌ (సి) రోహిత్‌ (బి) అక్షర్‌ 0, రూట్‌ (సి) రహానే (బి) అక్షర్‌ 33, స్టోక్స్‌ (సి) కోహ్లి (బి) అశ్విన్‌ 8, పోప్‌ (సి) ఇషాంత్‌ (బి) అక్షర్‌ 12, ఫోక్స్‌ (సి) అక్షర్‌ (బి) కుల్దీప్‌ 2, అలీ (స్టంప్డ్‌) పంత్‌ (బి) కుల్దీప్‌ 43, స్టోన్‌ (ఎల్బీ) (బి) అక్షర్‌ 0, బ్రాడ్‌ (నాటౌట్‌) 5, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం (54.2 ఓవర్లలో ఆలౌట్‌) 164. 
వికెట్ల పతనం: 1–17, 2–49, 3–50, 4–66, 5–90, 6–110, 7–116, 8–116, 9–126, 10–164. 
బౌలింగ్‌: ఇషాంత్‌ 6–3–13–0, అక్షర్‌ 21–5–60–5, అశ్విన్‌ 18–5–53–3, సిరాజ్‌ 3–1–6–0, కుల్దీప్‌ 6.2–1–25–2.

పరుగులపరంగా ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. 1986లో భారత్‌ 279 పరుగులతో గెలిచింది. ఇవి కాక మరో 6 సార్లు భారత్‌ ఇన్నింగ్స్‌ విజయాలు సాధించింది. 

తొలి టెస్టులోనే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన తొమ్మిదో భారత బౌలర్‌గా అక్షర్‌ నిలిచాడు. గతంలో హిర్వాణీ, అశ్విన్, ఆబిద్‌ అలీ, దిలీప్‌ దోషి, షమీ, అమిత్‌ మిశ్రా, నిస్సార్, వామన్‌ కుమార్‌ ఈ ఘనత సాధించారు.  

భారత గడ్డపై కెప్టెన్‌గా కోహ్లి సాధించిన టెస్టు విజయాల సంఖ్య. ధోని (21) రికార్డును అతను సమం చేశాడు.

‘మా నాన్నతో పాటు వచ్చి ఇక్కడి స్టాండ్స్‌లో ఎన్నో మ్యాచ్‌లు చూశాను. ఇక్కడ ఆడిన నాలుగు టెస్టుల్లో ఇదే అన్నింటికంటే ప్రత్యేకం. నేను బ్యాటింగ్‌కు వచ్చినా, బౌలింగ్‌కు దిగినా ప్రేక్షకులంతా నాపై ఎంతో అభిమానం ప్రదర్శించారు. ఏం చెప్పాలో నాకు మాటలు రావడం లేదు. నేనో హీరోననే భావం కలుగుతోంది. ఈ విజయం మా చెన్నై ప్రేక్షకులకు అంకితం’  – అశ్విన్‌

సోమవారం ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన శుబ్‌మన్‌ గిల్‌ను ముందు జాగ్రత్తగా స్కానింగ్‌కు పంపినట్లు బీసీసీఐ వెల్లడించింది. సోమవారం అశ్విన్‌ బౌలింగ్‌లో లారెన్స్‌ కొట్టిన షాట్‌ ఫార్వర్డ్‌ షార్ట్‌ లెగ్‌లో ఉన్న గిల్‌ ఎడమ మోచేతికి బలంగా తాకింది. మంగళవారం అతను ఫీల్డింగ్‌ చేయలేదు.

‘ఒక జట్టుగా మేం చూపించిన పట్టుదలకు ఈ టెస్టు నిదర్శనం. పరిస్థితులు ఇరు జట్లకూ ఒకేలా ఉన్నాయి. కానీ మేం వాటిని సమర్థంగా ఉపయోగించుకున్నాం. ఈ పిచ్‌పై టాస్‌ ప్రభావం చూపించదని నా అభిప్రాయం. రెండో ఇన్నింగ్స్‌లోనూ మేం దాదాపు 300 పరుగులు చేశాం. నా బ్యాటింగ్‌లో కూడా ఏమైనా తప్పులుంటే వెంటనే సరి చేసుకుంటున్నాను. పింక్‌ టెస్టులో ఇంగ్లండ్‌నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని భావిస్తున్నా’    - విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌

మరిన్ని వార్తలు