న్యూజిలాండ్‌తో మూడో టీ20కి ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

21 Nov, 2022 21:38 IST|Sakshi

నేపియర్‌లోని మెక్లీన్‌ పార్క్‌ వేదికగా రేపు (నవంబర్‌ 22) న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడో టీ20కి ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ తెలిసింది. రేపు జరుగబోయే మ్యాచ్‌కు వరుణుడి నుంచి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. మ్యాచ్‌ సమయానికి (భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు) ఆకాశం మేఘావృతమైనప్పటికీ.. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువని అక్కడి వాతావరణ శాఖ వెదర్‌ ఫోర్‌కాస్ట్‌లో పేర్కొంది.

మ్యాచ్‌ ఎటువంటి అంతరాయం లేకుండా 20 ఓవర్ల మ్యాచ్‌గా సాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆకాశం పూర్తిగా మబ్బు పట్టి ఉంటే పేసర్లకు అనుకూలిస్తుందని, పరుగుల ప్రవాహానికి కూడా అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. టాస్‌ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉందని సమాచారం.  

కాగా, సిరీస్‌ డిసైడర్‌ కావడంతో ఈ మ్యాచ్‌ కచ్చితంగా జరగాలని ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానులు కోరుకుంటున్నారు. వెల్లింగ్టన్‌లో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. మౌంట్‌ మాంగనూయ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ విధ్వంసం (111 నాటౌట్‌), దీపక్‌ హుడా మాయాజాలం (4/10) చేయడంతో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

మూడో టీ20లో కివీస్‌ జట్టుకు టిమ్‌ సౌథీ నాయకత్వం వహించనున్న విషయం తెలిసిందే. మెడికల్‌ అపాయింట్‌మెంట్‌ ఉండటంతో రెగ్యలర్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ లీవ్‌ తీసుకోవడంతో సౌథీకి జట్లు పగ్గాలు అప్పజెప్పారు. విలియమ్సన్‌ స్థానాన్ని మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ మార్పు మినహా రెండో టీ20లో ఆడిన జట్టునే కివీస్‌ యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. రెండో టీ20లో అంతగా ఆకట్టుకోలేని సుందర్‌ స్థానంలో హర్షల్‌ పటేల్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 


 

మరిన్ని వార్తలు