ఆసీస్‌ను ఓడించాం

25 Dec, 2023 05:59 IST|Sakshi

తొలిసారి టెస్టు ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై గెలిచిన భారత మహిళల జట్టు

ముంబై: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఎట్టకేలకు పదకొండో ప్రయత్నంలో ఆ్రస్టేలియా మహిళల జట్టుపై భారత జట్టు తొలిసారి టెస్టు విజయాన్ని అందుకుంది. ఇక్కడి వాంఖెడె మైదానంలో ఆ్రస్టేలియాతో జరిగిన నాలుగు రోజుల ఏకైక టెస్టులో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా సమష్టిగా ఆడితే ఎంతటి మేటి జట్టునైనా ఓడించవచ్చని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం నిరూపించింది.

ఆ్రస్టేలియా నిర్దేశించిన 75 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా 18.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. మ్యాచ్‌ మొత్తంలో ఏడు వికెట్లు తీసిన భారత ఆఫ్‌ స్పిన్నర్‌ స్నేహ్‌ రాణాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. పటిష్టమైన ఇంగ్లండ్‌తో గత ఆదివారం డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన భారత జట్టు... వారం తిరిగేలోపు మరో మేటి జట్టు ఆ్రస్టేలియాను బోల్తా కొట్టించి ఈ ఏడాదిని దిగ్విజయంగా ముగించింది.  

రాణించిన స్నేహ్, రాజేశ్వరి
ఆట చివరిరోజు ఓవర్‌నైట్‌ స్కోరు 233/5తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ్రస్టేలియా కేవలం 28 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 261 పరుగుల వద్ద ఆలౌటైంది. యాష్లే గార్డ్‌నర్‌ (7)ను ఆట రెండో ఓవర్‌లోనే పూజ వస్త్రకర్‌ వికెట్లముందు దొరకబుచ్చుకోవడంతో ఆసీస్‌ పతనం మొదలైంది. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన అనాబెల్‌ సదర్లాండ్‌ (102 బంతుల్లో 27; 3 ఫోర్లు)ను...అలానా కింగ్‌ (0)ను వరుస బంతుల్లో స్నేహ్‌ రాణా అవుట్‌ చేయడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ఎక్కువసేపు కొనసాగలేదు.

చివరి రెండు వికెట్లను రాజేశ్వరి గైక్వాడ్‌ తీయడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 261 పరుగులవద్ద ముగిసింది. 75 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు తొలి ఓవర్‌లోనే దెబ్బ పడింది. షఫాలీ వర్మ (4) నాలుగో బంతికి పెవిలియన్‌ చేరింది. ఆ తర్వాత రిచా ఘోష్‌ (32 బంతుల్లో 13; 3 ఫోర్లు)తో కలిసి స్మృతి మంధాన (61 బంతుల్లో 38 నాటౌట్‌; 6 ఫోర్లు) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించింది. రిచా అవుటయ్యాక జెమీమా రోడ్రిగ్స్‌ (15 బంతుల్లో 12 నాటౌట్‌; 2 ఫోర్లు)తో కలిసి స్మృతి భారత్‌ను విజయతీరానికి చేర్చింది.

స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌: 219; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 406; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: బెత్‌ మూనీ (రనౌట్‌) 33; లిచ్‌ఫెల్డ్‌ (బి) స్నేహ్‌ రాణా 18; ఎలీస్‌ పెరీ (సి) యస్తిక (బి) స్నేహ్‌ రాణా 45; తాలియా మెక్‌గ్రాత్‌ (బి) హర్మన్‌ప్రీత్‌ 73; అలీసా హీలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్మన్‌ప్రీత్‌ 32; అనాబెల్‌ సదర్లాండ్‌ (సి) యస్తిక (బి) స్నేహ్‌ రాణా 27; యాష్లే గార్డ్‌నర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) పూజ 7; జెస్‌ జొనాసెన్‌ (బి) రాజేశ్వరి 9; అలానా కింగ్‌ (బి) స్నేహ్‌ రాణా 0; కిమ్‌ గార్త్‌ (బి) రాజేశ్వరి 4; లారెన్‌ చీట్లె (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (105.4 ఓవర్లలో ఆలౌట్‌) 261.
వికెట్ల పతనం: 1–49, 2–56, 3–140, 4–206, 5–221, 6–233, 7–251, 8–251, 9–260, 10–261.
బౌలింగ్‌: రేణుక 11–4–32–0, పూజ వస్త్రకర్‌ 11–1–40–1, స్నేహ్‌ రాణా 22–5–66–4, దీప్తి శర్మ 22–7– 35–0, రాజేశ్వరి గైక్వాడ్‌ 28.4–11 –42–2, జెమీమా 2–0–13–0, హర్మన్‌ప్రీత్‌ 9–0–23–2.  

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: షఫాలీ వర్మ (సి) అలీసా (బి) గార్త్‌ 4; స్మృతి మంధాన (నాటౌట్‌) 38; రిచా ఘోష్‌ (సి) తాలియా (బి) గార్డ్‌నర్‌ 13; జెమీమా (నాటౌట్‌)12; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.4 ఓవర్లలో రెండు వికెట్లకు) 75.
వికెట్ల పతనం: 1–4, 2–55.
బౌలింగ్‌: కిమ్‌ గార్త్‌ 5–1–19–1, యాష్లే గార్డ్‌నర్‌ 9–2–18–1, తాలియా 2–0–14–0, జెస్‌ జొనాసెన్‌ 2.4–0–16–0.

7: ఓవరాల్‌గా టెస్టు ఫార్మాట్‌లో భారత మహిళల జట్టు గెలిచిన టెస్టుల
సంఖ్య. 1976 నుంచి 2023 వరకు భారత జట్టు 40 టెస్టులు ఆడింది. ఇందులో ఏడింటిలో గెలిచి, ఆరింటిలో ఓడిపోయింది. మిగతా 27 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.

11: ఆస్ట్రేలియా జట్టుతో 1977 నుంచి 2023 మధ్యకాలంలో భారత్‌ 11 టెస్టులు ఆడింది. ఈ మ్యాచ్‌కు ముందు ఆ్రస్టేలియా చేతిలో భారత్‌ నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి, ఆరింటిని ‘డ్రా’ చేసుకుంది.

2: స్వదేశంలో భారత జట్టు ఒకే ఏడాది రెండు టెస్టుల్లో గెలవడం ఇదే తొలిసారి. భారత్‌ నెగ్గిన ఏడు టెస్టుల్లో నాలుగు స్వదేశంలో, మూడు విదేశీ గడ్డపై వచ్చాయి. హర్మన్‌ప్రీత్‌ కెపె్టన్సీలో భారత జట్టు ఆడిన
రెండు టెస్టుల్లోనూ నెగ్గడం విశేషం.

9: గత 17 ఏళ్లలో భారత జట్టు తొమ్మిది టెస్టులు ఆడింది. ఇందులో ఒక టెస్టులో ఓడి, ఐదు టెస్టుల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది.  
 

>
మరిన్ని వార్తలు