T20 World Cup 2024: ఇంగ్లండ్‌ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా కీరన్‌ పొలార్డ్‌..

24 Dec, 2023 19:27 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2024కు ముందు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ కీరన్ పొలార్డ్‌ను నియమించింది.  వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ అమెరికా, వెస్టిండీస్‌ వేదికలగా జరగనున్న నేపథ్యంలో ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. "వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ కోసం ఇంగ్లండ్‌ పురుషుల జట్టు  అసిస్టెంట్ కోచ్‌గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ పొలార్డ్ నియమితులయ్యారు.

పొలార్డ్‌కు టీ20ల్లో అపారమైన అనుభవం ఉంది. టీ20 వరల్డ్‌కప్‌- 2012 విజయంలో పొలార్డ్ కీలక పాత్ర పోషించాడు. టీ20ల్లో 600 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. అటువంటి లెజెండరీ క్రికెటర్‌తో ఒప్పందం కుదర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది" అని ఇంగ్లండ్‌ వెల్స్‌ క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

కాగా గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పొలార్డ్‌ ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అయితే అంతర్జాతీయ స్ధాయిలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. ఇక 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన పొలార్డ్‌ 15 ఏళ్ల పాటు విండీస్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.  123 వన్డేలు, 101 టీ20లు ఆడిన పొలార్డ్.. వరుసగా 2,706, 1569 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో 3  అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు