INDW Vs AUSW 3rd ODI: అరుదైన 600 వికెట్ల క్లబ్‌లో చేరిన టీమిండియా పేసర్‌

26 Sep, 2021 16:56 IST|Sakshi

J​hulan Goswami Breaches 600 Wickets Mark: భారత మహిళా జట్టు స్టార్‌ పేస్‌ బౌలర్‌ ఝుల‌న్ గోస్వామి చ‌రిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నామమాత్రపు ఆఖరి వ‌న్డేలో మెగ్ లానింగ్‌ను ఔట్ చేయ‌డం ద్వారా అరుదైన 600 వికెట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటివరకు 192 వన్డేలు, 11 టెస్ట్‌లు, 56 టీ20ల్లో 337 అంతర్జాతీయ వికెట్లు సాధించిన ఝులన్‌.. దేశవాళీ టోర్నీల్లో 264 వికెట్లు పడగొట్టి తన వికెట్ల సంఖ్యను 601కి పెంచుకుంది. ఝులన్‌ పేరిట ఇప్పటికే వన్డేల్లో అత్యధిక వికెట్ల (240) రికార్డు నమోదై ఉంది. 38 ఏళ్ల ఝులన్‌ వన్డే ఫార్మాట్‌లో 200 వికెట్లు పడగొట్టిన ఏకైక మహిళా బౌలర్‌గా నేటికీ చలామణి అవుతుంది. 

ఇక నేటి మ్యాచ్‌ విషయానికొస్తే 3 వన్డేల సిరీస్‌ను 0-2తో ఇదివరకే కోల్పోయిన టీమిండియా.. నామమాత్రపు మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆసీస్‌ వరుస విజయాల(26 విజయాలు) పరంపరకు అడ్డుకట్ట వేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేయగా.. మిథాలీ సేన 49.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యస్తిక భాటియా(69 బంతుల్లో 9 ఫోర్లతో 64), షెఫాలీ వర్మ(91 బంతుల్లో 7 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో చేలరేగగా.. దీప్తి శర్మ(30 బంతుల్లో 3 ఫోర్లతో 31), స్నేహ్‌ రాణా(27 బంతుల్లో 5 ఫోర్లతో 30) రాణించి ఆసీస్‌ పర్యటనలో తొలి విజయాన్ని అందించారు. 3/37తో చెలరేగిన ఝులన్ గోస్వామికి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 30 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: భారత మహిళల రికార్డు ఛేజింగ్‌.... ఆసీస్‌ విజయాలకు బ్రేక్‌

మరిన్ని వార్తలు