KL Rahul: ఛ.. మరీ చెత్తగా.. మా ఓటమికి ప్రధాన కారణం అదే! పాటిదార్‌ అద్భుతం!

26 May, 2022 11:25 IST|Sakshi
లక్నో కెప్టెన్‌ కేఎల్‌రాహుల్‌(PC: IPL/BCCI)

IPL 2022 Eliminator LSG Vs RCB: ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే ప్లే ఆఫ్స్‌ చేరిన లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కీలక మ్యాచ్‌లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన కేఎల్‌ రాహుల్‌ సేన.. ఐపీఎల్‌- 2022 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో బుధవారం తలపడింది.

కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(58 బంతుల్లో 79 పరుగులు), దీపక్‌ హుడా(26 బంతుల్లో 45 పరుగులు) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి చవిచూసింది. ఫీల్డింగ్‌ తప్పిదాలకు తోడు బ్యాటర్ల వైఫల్యం కారణంగా ఆర్సీబీ చేతిలో 14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించాలని భావించిన లక్నోకు భంగపాటు తప్పలేదు.

ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌.. తమ జట్టు ఫీల్డింగ్‌ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, కొత్తగా క్యాష్‌ రిచ్‌లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన తాము ప్లే ఆఫ్స్‌ వరకు చేరుకోవడం సానుకూల అంశమని పేర్కొన్నాడు. ఈ మేరకు రాహుల్‌ మాట్లాడుతూ.. ‘‘మైదానంలో మేము చేసిన తప్పిదాలే మా ఓటమికి కారణం. సులువైన క్యాచ్‌లు వదిలేసి కూడా గెలవాలని ఆశించడం సరికాదు.

పాటిదార్‌ అద్భుతంగా ఆడాడు. టాపార్డర్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన బ్యాటర్‌ శతకం సాధిస్తే ఆ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడా అదే జరిగింది. వాళ్లు(ఆర్సీబీ) అద్భుతంగా ఫీల్డింగ్‌ చేశారు. మా ఫీల్డింగ్‌ చెత్తగా ఉంది’’ అని తెలిపాడు.

ఇక తమలోని సానుకూల అంశాలను ప్రస్తావిస్తూ.. ‘‘మాది కొత్త ఫ్రాంఛైజీ. ఇందులో చాలా మంది యువకులే ఉన్నారు. నిజానికి మేము చాలా తప్పిదాలు చేశాము. వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుని రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వస్తాం. మొహ్సిన్‌ అద్భుత నైపుణ్యాలు కలవాడు. ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని మరింత రాటుదేలితే వచ్చే సీజన్‌లో అతడు మరింత బాగా రాణిస్తాడు’’ అని లక్నో సారథి రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

కాగా ఆర్సీబీ బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌ అద్భుత శతకంతో ఆకట్టుకుని ఆఖరి వరకు అజేయంగా నిలిచి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక పాటిదార్‌, దినేశ్‌ కార్తిక్‌(23 బంతుల్లో 37 పరుగులు- నాటౌట్‌) ఇచ్చిన క్యాచ్‌లను డ్రాప్‌ చేసి లక్నో  భారీ మూల్యమే చెల్లించింది.  

ఐపీఎల్‌-2022: ఎలిమినేటర్‌ మ్యాచ్‌
లక్నో వర్సెస్‌ ఆర్సీబీ స్కోర్లు
టాస్‌: లక్నో
ఆర్సీబీ- 207/4 (20)
లక్నో- 193/6 (20)
విజేత: 14 పరుగుల తేడాతో గెలిచి క్వాలిఫైయర్‌కు అర్హత సాధించిన ఆర్సీబీ
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రజత్‌ పాటిదార్‌(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 112 పరుగులు- నాటౌట్‌)

ఇది కూడా చదవండి:  IPL 2022: ఐపీఎల్‌లో కేఎల్‌ రాహుల్‌ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా..!

మరిన్ని వార్తలు