IPL 2023 Mini Auction-Harry Brook: బ్రూక్‌ పంట పండింది.. ఎస్‌ఆర్‌హెచ్‌ తలరాత మారేనా!

23 Dec, 2022 15:17 IST|Sakshi

ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ హ్యారీబ్రూక్‌ పంట పండింది. ఇటీవలే కాలంలో నిలకడగా ఆడుతున్న బ్రూక్‌ టి20 వరల్డ్‌కప్‌లోనూ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తాజాగా పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో సెంచరీలతో కథం తొక్కిన హ్యారీ బ్రూక్‌కు శుక్రవారం కొచ్చి వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ మినీ వేలంలో భారీ ధర పలికింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ హ్యారీ బ్రూక్‌ను రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది.

ఈ వేలంలో ఇప్పటివరకు వేలంలోకి వచ్చిన ఆటగాళ్లలో బ్రూక్‌దే అత్యధికం కావడం విశేషం. బ్రూక్‌ తర్వాత మయాంక్‌ అగర్వాల్‌ రూ. 8.25 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌కే అమ్ముడుపోయాడు. ఆ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను రూ. 2కోట్ల కనీస ధరకు గుజరాత్‌ లయన్స్‌ దక్కించుకుంది. ఇక అజింక్యా రహానేనను సీఎస్‌కే కనీస ధర రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది.

ఇక హ్యారీ బ్రూక్‌ ఇటీవలే పాకిస్తాన్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌ ద్వారా 125 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. తొలి ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్‌ బ్యాటర్‌గా హ్యారీబ్రూక్‌ నిలిచాడు.ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన బ్రూక్‌ ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి 480 పరుగులు(12, 153, 87, 9, 108,111) చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. మరో విషయమేంటంటే బ్రూక్‌ సాధించిన ఆ మూడు సెంచరీలు పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లోనే వచ్చాయి. ఇంతకముందు ఇంగ్లండ్‌ తరపున కేఎస్‌ రంజిత్‌సింగ్హ్జి 418 పరుగులు( 62, 154*, 8, 11, 175,8*), టిప్‌ ఫోస్టర్‌ 411 పరుగులు(287, 19,49*, 21, 16,19)లు ఉన్నారు. తాజాగా వీరిద్దరిని అధిగమించిన హ్యారీ బ్రూక్‌ 480 పరుగులతో టాప్‌ స్థానంలో నిలిచాడు.

చదవండి: సామ్‌ కరన్‌ కొత్త చరిత్ర.. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా

మరిన్ని వార్తలు