IPL 2023- RCB: కివీస్‌ ఆల్‌రౌండర్‌ ఎంట్రీ.. ప్రకటించిన ఆర్సీబీ! ధర ఎంతంటే

18 Mar, 2023 13:26 IST|Sakshi

IPL 2023- RCB- Michael Bracewell: న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మైకేల్‌ బ్రేస్‌వెల్‌ ఐపీఎల్‌-2023 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఇంగ్లండ్‌ బ్యాటర్‌ విల్‌ జాక్స్‌ స్థానంలో బ్రేస్‌వెల్‌ ఆర్సీబీకి ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి శనివారం ప్రకటన విడుదల చేసింది.

‘‘ఐపీఎల్‌-2023లో విల్‌ జాక్స్‌ స్థానాన్ని న్యూజిలాండ్‌కు చెందిన మైకేల్‌ బ్రేస్‌వెల్‌ భర్తీ చేయనున్నాడు. 32 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ కివీస్‌ భారత పర్యటనలో టీ20 సిరీస్‌లో టాప్‌ వికెట్‌ టేకర్‌. అదే విధంగా వన్డే మ్యాచ్‌లో 140 పరుగులతో అద్భుత పోరాటపటిమ కనబరిచాడు’’ అంటూ బ్రేస్‌వెల్‌కు స్వాగతం పలుకుతూ సోషల్‌ మీడియాలో అతడి ఫొటో షేర్‌ చేసింది.

లేట్‌ ఎంట్రీ.. అయినా..
కాగా ఎడమచేతి వాటం గల బ్యాటర్‌, రైట్‌ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ అయిన బ్రేస్‌వెల్‌ కివీస్‌ తరఫున 16 టీ20లు ఆడి 113 పరుగులు చేశాడు. అదే విధంగా 21 వికెట్లు తీశాడు. నెదర్లాండ్స్‌తో వన్డేతో 2022లో 31 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ ఆల్‌రౌండర్‌.. ఈ ఏడాది మార్చి ఆరంభంలో చివరిసారిగా శ్రీలంకతో టెస్టు ఆడాడు. 

ఇదిలా ఉంటే.. విల్‌ జాక్స్‌ను ఆర్సీబీ 3.2 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా అతడు దూరం కావడంతో బ్రేస్‌వెల్‌కు అవకాశం ఇచ్చింది. కనీస ధర కోటితో వేలంలో తన పేరు నమోదు చేసుకున్న బ్రేస్‌వెల్‌ను అదే ధరతో ఆర్సీబీ సొంతం చేసుకోనుంది. కాగా బ్రేస్‌వెల్‌కు ఇదే తొలి ఐపీఎల్‌ సీజన్‌ కావడం విశేషం. ఇక ఏప్రిల్‌ 2న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌తో ఆర్సీబీ ఈ ఏడాది తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది.

చదవండి: IND Vs AUS: ఏంటి హార్దిక్‌ ఇది.. సీనియర్లకు ఇచ్చే విలువ ఇదేనా? పాపం కోహ్లి! వీడియో వైరల్‌
Ravindra Jadeja: నా దృష్టిలో నిజమైన హీరో జడేజానే! నువ్వేనా ఈ మాట అన్నది? నిజమా!

మరిన్ని వార్తలు