IND vs SA: ఆడేది 3 మ్యాచ్‌లు మాత్రమే.. 17 మంది ఎందుకు? భారత సెలక్టర్లపై ప్రశ్నల వర్షం

1 Dec, 2023 15:51 IST|Sakshi

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా టూర్‌లో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌లకు మూడు వేర్వేరు జట్లను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. మూడు ఫార్మాట్‌లలో ముగ్గురు వెర్వేరు కెప్టెన్లను సెలక్టర్లు ఎంపిక చేశారు.

దక్షిణాఫ్రికాతో టీ20ల్లో సూర్యకుమార్‌ యాదవ్ భారత జట్టుకు సారథ్యం వహించనుండగా.. వన్డేల్లో రాహుల్‌.. టెస్టుల్లో రోహిత్‌ శర్మకు జట్టు పగ్గాలను అప్పగించారు. అయితే ప్రోటీస్‌తో వైట్‌ బాల్‌ సిరీస్‌లకు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి దూరమయ్యారు. ఇక ఇది ఇలా ఉండగా.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు 17 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఎంపికపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్‌ చోప్రా ఆసం‍తృప్తి వ్యక్తం చేశాడు.

టీ20ల​కు 17 మంది సభ్యులను సెలక్టర్లు ఎందుకు ఎంపిక చేశారో అర్ధం కావడం లేదని చోప్రా అన్నాడు. కాగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన రవీంద్ర జడేజా, శుబ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌చ కుల్దీప్‌ యాదవ్‌.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు మాత్రం అందుబాటులోకి వచ్చారు.

ఈ నేపథ్యంలో చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ.. "దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇది సరైన నిర్ణయమే. రవీంద్ర జడేజాను వైస్‌కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇది కాస్త ఆసక్తికర నిర్ణయం. కానీ కేవలం మూడు మ్యాచ్‌ల సిరీస్‌​కు 17 మంది ఆటగాళ్లు ఎందుకు? ఇప్పుడు తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌ వంటి యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కే సూచనలు కన్పించడం లేదు.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంపిక చేయడం కూడా చాలా కష్టతరమవుతోంది. కనీసం నలుగురు ఆటగాళ్లు సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండా బెంచ్‌కే పరిమితమవుతారు. అటువంటి అంతమంది ఆటగాళ్లను దక్షిణాఫ్రికాకు పంపడం ఎందుకు "అని ప్రశ్నల వర్షం కురిపించాడు.

దక్క్షిణాఫ్రికాతో టీ20లకు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ , అర్షదీప్ సింగ్, మహ్మద్‌ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.

మరిన్ని వార్తలు