-

Kevin O Brien: ఆటకు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్‌ క్రికెట్‌ దిగ్గజం.. సెలక్టర్ల వల్లే!

16 Aug, 2022 16:08 IST|Sakshi
ఐర్లాండ్‌ క్రికెట్‌ దిగ్గజం కెవిన్‌ ఒబ్రెయిన్‌(PC: Kevin O Brien Twitter)

Kevin O Brien: ఐర్లాండ్‌ క్రికెట్‌ దిగ్గజం కెవిన్‌ ఒబ్రెయిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పదహారేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీ తర్వాత ఆట నుంచి వైదొలుగుదామని భావించినప్పటికీ.. గత కొన్ని రోజులుగా తనను సెలక్టర్లు పక్కనపెట్టారన్న 38 ఏళ్ల కెవిన్‌.. అందుకే రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా మంగళవారం సుదీర్ఘ నోట్‌ షేర్‌ చేశాడు.

అందరికీ ధన్యవాదాలు!
‘‘ఐర్లాండ్‌ జట్టుకు ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఈ ప్రయాణంలో ఎంతో మంది స్నేహితులను సంపాదించుకున్నాను. నాతో పనిచేసిన కోచ్‌లు.. సిబ్బందికి ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే అవకాశం కల్పించిన అడీ బిరెల్‌, ఫిల్‌ సిమ్మన్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.

క్రికెటర్‌గా నా ప్రయాణంలో వెన్నంటి నిలిచిన నా కుటుంబ సభ్యులకు థాంక్యూ. నేను ఆటలో బిజీగా ఉన్న సమయంలో కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్న నా భార్య రూత్‌ అనీకి ప్రత్యేక ధన్యవాదాలు’’ అంటూ కెవిన్‌ తన నోట్‌లో పేర్కొన్నాడు.

2006లో ఎంట్రీ ఇచ్చి!
కాగా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ కెవిన్‌ ఒబ్రెయిన్‌ 2006లో ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌తో ఐర్లాండ్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ.. టెస్టు క్రికెట్‌లో ఐర్లాండ్‌ జట్టు అసోసియేట్‌ మెంబర్‌షిప్‌ పొందడంలోనూ కీలకంగా వ్యవహరించాడు. 

ఇక 2008లో టీ20 ఫార్మాట్‌లో ఎంట్రీ ఇచ్చి.. మొత్తంగా 109 మ్యాచ్‌లు ఆడాడు. గతేడాది అక్టోబరు(వరల్డ్‌కప్‌)లో కెవిన్‌ తన చివరి టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత అతడిని సెలక్టర్లు పరిమిత ఓవర్ల జట్టుకు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో కెవిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం గమనార్హం.

టెస్టుల్లో..
ఇదిలా ఉంటే.. 2018లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన కెవిన్‌.. 2019లో లార్డ్స్ మైదానంలో తన చివరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. మొత్తంగా మూడు టెస్టులాడిన అతడు 258 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 118.

వన్డేల్లో ఇలా
వన్డేల విషయానికొస్తే.. 152 మ్యాచ్‌లు ఆడి 3619 పరుగులు(అత్యధిక స్కోరు 142) చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో ఒక సెంచరీ(124 పరుగులు) నమోదు చేశాడు. కెవిన్‌ తన కెరీర్‌లో మొత్తం నాలుగు శతకాలు(టెస్టుల్లో ఒకటి, వన్డేల్లో రెండు, టీ20లలో ఒకటి) బాదాడు.

బౌలర్‌గా అరుదైన ఘనత
ఇక రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ అయిన కెవిన్‌.. వన్డేల్లో 114 వికెట్లు తన ఖాతాలో వేసుకుని.. ఐర్లాండ్‌ జట్టులో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు.. ఐసీసీ పురుషుల క్రికెట్‌ వరల్డ్‌కప్‌ టోర్నీలో వేగవంతమైన సెంచరీ(50 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్సర్లతో శతకం.. మొత్తంగా 113 పరుగులు) సాధించిన బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు. 2011 ప్రపంచకప్‌ సందర్భంగా బెంగళూరులో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

చదవండి: Kohli- Rohit: కోహ్లి కెప్టెన్సీలో జట్టు దూకుడుగా ఉండేది కాదు! రోహిత్‌ శర్మ అలా కాదు! అతడు ఉన్నాడంటే..

మరిన్ని వార్తలు