ఐర్లాండ్‌ రాజధానిలో చెలరేగిన హింస: ప్రధాని దిగ్భ్రాంతి,కొత్త చట్టాలు

24 Nov, 2023 17:30 IST|Sakshi

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ సిటీ సెంటర్‌లో గత రాత్రి (గురువారం, నవంబరు 23)  కత్తి పోట్ల ఘటన తీవ్ర అల్లర్లు , భారీ విధ్వంసానికి దారి తీసింది. పాఠశాల వద్ద ఓ వ్యక్తి పొడవాటి కత్తితో విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, మహిళ (స్కూల్ కేర్ అసిస్టెంట్)  తీవ్రంగా గాయపడ్డారు.  ఈఘటన అనంతరం  సెంట్రల్‌ డబ్లిన్‌ అంతటా  హింసాత్మక నిరసన చెలరేగింది.   ఈ ఘటన తరువాత  దేశంలో మరింత అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని  ఐర్లాండ్ పోలీసు చీఫ్ హెచ్చరించారు. శుక్రవారం నాటికి రాజధాని ఉద్రిక్తంగా  ఉన్నప్పటికీ  ప్రశాంతంగా ఉందని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 34 మందిని అరెస్టు చేశారు.

తీవ్ర ఆగ్రహావేశాలతో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన నిరసన కారులు బీభత్సం సృష్టించారు. 11 పోలీసు వాహనాలను ధ్వంసం చేయగా, 13 దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోలీసులతో జరిగిన ఘర్షణలో మరిన్నిదుకాణాలను దుండగులు లూటీ చేశారు.  మూడు గంటలకు పైగా జరిగిన అల్లర్లలో మూడు బస్సులు, ఒక రైలు(ట్రామ్‌ను) తగుల బెట్టారు.  అనేక మంది పోలీసు అధికారులు  కూడా గాయపడ్డారు.  వీరిలో  ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉంది.  ఇలాంటి హింస గతంలో ఎన్నడూ చూడలేదని ఐరిష్ పోలీసు కమీషనర్ డ్రూ హారిస్ వ్యాఖ్యానించారు. మరోవైపు డబ్లిన్‌ తగులబడిపోతున్నట్టుగా అనిపించిందంటూ స్థానికులు   ఆందోళనకు గురయ్యారు.

 ప్రధాని దిగ్భ్రాంతి, కొత్త చట్టాలు
కత్తిపోట్ల ఘటనపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  దాదాపు 500 మంది అల్లర్లలో పాల్గొన్నారని , వీరంతా జాతికే అవమానం తెచ్చారని మండిపడ్డారు.  వీరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు త్వరలోనే  కొత్తచట్టాలను తీసుకురానున్నట్టు తెలిపారు.

50 ఏళ్ల ఐరిష్‌ పౌరుడిని నిందితుడిగా అదుపులోకి  తీసుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో  చికిత్స  పొందుతున్నాడు. నిరాయుధులను చేసి, పోలీసులు వచ్చే వరకు అతన్ని నేలపై పిన్ చేశారు. అతను ఆసుపత్రిలో మరియు కాపలాగా చికిత్స పొందుతున్నాడు. ఈ దాడికి కారణం ఏంటి అనేదానిపై ప్రస్తుతానికి  ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.

మరిన్ని వార్తలు