'అనుష్క జీ.. ఆయన వయసుకు గౌరవమివ్వండి'

26 Sep, 2020 14:04 IST|Sakshi

ముంబై : భారత మాజీ క్రికెటర్‌, లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌, కోహ్లి భార్య అనుష్క శర్మల శుక్రవారం మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా దిగ్గజ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్‌ గావస్కర్‌ చేసిన కామెంట్స్‌ వివాదాన్ని రేపాయి. ఈ అంశంలో కొందరు గవాస్కర్‌కు మద్దతుగా ఉంటే.. మరికొందరు అనుష్క చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించారు. కాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా ఈ విషయంపై స్పందించాడు. తన మద్దతు మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌కే ఉంటుందని పఠాన్‌ ట్విటర్‌ ద్వారా తెలిపాడు.

'సునీల్‌ గవాస్కర్‌.. వయసులో పెద్దవారు.. భారత్‌ క్రికెట్‌కు తన సేవలందించాడు. ఆయనను గౌరవించాల్సిన అవసరం మనకు ఉంది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరో వక్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టినట్లు స్వయంగా ఆయనే వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. ఆయన వయసును గౌరవించండం'టూ ట్వీట్‌ చేశాడు.(చదవండి : అతని ఆటలో నన్నెందుకు లాగుతారు?)

ఇక అసలు విషయంలోకి వెళితే.. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో గురువారం బెంగళూరు, పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో సునీల్‌ గావస్కర్‌ కామెంటేటర్‌గా (హిందీలో) వ్యవహరించారు. కోహ్లి క్రీజ్‌లో ఉన్న సమయంలో సహ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రాతో లీగ్‌కు ముందు ఆటగాళ్ల సాధన గురించి చర్చిస్తూ... ‘ప్రాక్టీస్‌తోనే తన ఆట మెరుగవుతుందనే విషయం కోహ్లికి బాగా తెలుసు. ఎంతో సాధన చేయాలని కూడా అతను కోరుకుంటాడు. లాక్‌డౌన్‌ సమయంలో కేవలం అనుష్క బౌలింగ్‌లోనే అతను ప్రాక్టీస్‌ చేయడం మనం వీడియోలో చూశాం. అయితే దాని వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు' అని గావస్కర్‌ పేర్కొన్నారు.

అయితే దీనిపై అనుష్క శర్మ వెంటనే స్పందిస్తూ.. ఇది మహిళలను కించపరిచే విధంగా ఉందని, కోహ్లి క్రికెట్‌ వ్యవహారాల్లో తనను లాగడం ఏమిటని ప్రశ్నించింది. ' మిస్టర్‌ గావస్కర్‌... మీ వ్యాఖ్య అమర్యాదగా ఉంది. అయితే భర్త ఆట గురించి భార్యను తప్పు పడుతున్నట్లుగా ఉన్న ఈ వ్యాఖ్య మీ నుంచి ఎలా వచ్చింది. ఇన్నేళ్లుగా ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి కామెంటరీలో మీరు ఎప్పుడూ మాట్లాడలేదు. నాకు కూడా అలాంటి గౌరవం ఇవ్వాలని మీరు అనుకోలేదా. అంటూ ప్రశ్నించారు. అనుష్క కామెంట్స్‌పై గవాస్కర్‌ స్పందిస్తూ..  తాను ఎలాంటి తప్పుడు మాట మాట్లాడలేదని, కొందరు వక్రీకరించడంతో సమస్య వచ్చిందంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.(చదవండి : అనుష్క పోస్ట్‌పై గావస్కర్‌ స్పందన)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు