ప్రపంచకప్‌ ఆర్చరీ టోర్నీలకు సురేఖ, ధీరజ్‌, చికిత

21 Feb, 2023 10:25 IST|Sakshi
జ్యోతి సురేఖ, ధీరజ్‌

సోనీపత్‌ (హరియాణా): ఈ ఏడాది జరిగే మూడు  ప్రపంచకప్‌ టోర్నీలు... ప్రపంచ చాంపియన్‌షిప్‌... అనంతరం ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల రికర్వ్, కాంపౌండ్‌ జట్లను భారత ఆర్చరీ సంఘం సోమవారం ప్రకటించింది. పురుషుల రికర్వ్‌ జట్టులో సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డు తరఫున పోటీపడ్డ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్‌... మహిళల కాంపౌండ్‌ జట్టులో ఆంధ్రప్రదేశ్‌ మేటి క్రీడాకారిణి వెన్నం జ్యోతి  సురేఖ, తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత చోటు సంపాదించారు.

సోనీపత్‌లోని భారత స్పోర్ట్స్‌ అథారిటీ కేంద్రంలో నిర్వహించిన ట్రయల్స్‌ ఆధారంగా జట్లను ఎంపిక చేశారు. పురుషుల, మహిళల రికర్వ్‌ విభాగాల్లో ఎనిమిది మంది చొప్పున... పురుషుల, మహిళల కాంపౌండ్‌  విభాగాల్లో ఎనిమిది మంది చొప్పున ఎంపిక చేశారు. ఇందులో టాప్‌–4లో నిలిచిన వారికి తొలి ప్రాధాన్యత లభిస్తుంది.

రెండు ప్రపంచకప్‌ టోర్నీలు ముగిశాక టాప్‌–4లో నిలిచిన వారు విఫలమైతే తదుపరి టోర్నీకి 5  నుంచి 8 స్థానాల్లో నిలిచిన వారికి చాన్స్‌ ఇస్తారు. మూడు ప్రపంచకప్‌ టోర్నీలు అంటాల్యాలో (ఏప్రిల్‌ 18–23)... షాంఘైలో (మే 16–21)... కొలంబియాలో (జూన్‌ 13–18) జరుగుతాయి.

ప్రపంచ చాంపియన్‌షిప్‌ జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు జర్మనీలో... ఆసియా క్రీడలు సెప్టెంబర్‌లో చైనాలో జరుగుతాయి. ట్రయల్స్‌లో విఫలమైన ‘ట్రిపుల్‌ ఒలింపియన్‌’ దీపిక కుమారి మహిళల రికర్వ్‌ జట్టులో చోటు సంపాదించలేకపోయింది.  

మార్చి 18న ఐఎస్‌ఎల్‌ ఫైనల్‌ 
ముంబై: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ ఫైనల్‌ మార్చి 18న గోవాలోని ఫటోర్డా పట్టణంలో జరుగుతుంది. ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు మార్చి 3న మొదలవుతాయి. ఇప్పటికే టాప్‌–2లో నిలిచిన ముంబై సిటీ, డిఫెండింగ్‌ చాంపియన్‌ హైదరాబాద్‌ ఎఫ్‌సీ నేరుగా సెమీఫైనల్‌ చేరాయి.  

మరిన్ని వార్తలు