హార్ధిక్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్‌

1 Jul, 2021 20:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమిండియా ఓటమికి పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ లేకపోవడమే ప్రధాన కారణమని దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ ఆరోపించారు. పేసర్లకు అనుకూలించే సౌథాంప్టన్ పిచ్‌పై పేస్ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను కాదని ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగడం కోహ్లీసేన కొంపముంచిందని పేర్కొన్నాడు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లుగా చెప్పుకునే కొందరు కనీసం నాలుగు ఓవర్లు వేసేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి వారిని ఆల్‌రౌండర్లుగా ఎలా పరిగణించాలని హార్ధిక్‌ ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యాలు చేశాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత తరం ఆల్‌రౌండర్లుగా చెప్పుకునే ఆటగాళ్లు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి అలిసిపోవడం చూస్తే బాధగా ఉంటుందని, అతిగా బ్యాటింగ్‌పై దృష్టి సారించడం వల్లే వాళ్లంతా ఇలా తయారవుతున్నారని విమర్శించాడు. 

ఈ తరం ఆటగాళ్లు మల్టిపుల్ రోల్ పోషించేందుకు ఆసక్తి చూపించడం లేదని, తమ జమానాలో అదనపు బాధ్యతలు తీసుకునేందుకు ఆటగాళ్లంతా సిద్దంగా ఉండేవారని, స్పెషలిస్ట్‌​బ్యాట్స్‌మెన్‌కు కూడా 10 ఓవర్లు బౌలింగ్ చేసే సత్తా ఉండేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన 20 మంది టీమిండియా సభ్యుల్లో  ఒక్క నిఖార్సైన పేస్ ఆల్‌రౌండర్ కూడా లేకపోవడం బాధాకరమని పేర్కొన్నాడు. కాగా, గత కొన్నేళ్లుగా హార్దిక్ పాండ్యా జట్టులో పేస్ ఆల్‌రౌండర్ రోల్ పోషించినప్పటికీ వెన్నుగాయం తర్వాత అతను బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం పేస్ ఆల్‌రౌండర్లతో కలిపి మొత్తం ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ అసాధారణ ప్రదర్శనతో 8 వికెట్లతో కోహ్లీ సేనను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు