Kraigg Brathwaite: ఏడు వందల నిమిషాల మారథాన్‌ ఇన్నింగ్స్‌‌.. సాహో విండీస్‌ కెప్టెన్‌

20 Mar, 2022 09:10 IST|Sakshi

నాయకుడనే వాడు జట్టును నడిపించడమే కాదు.. అవసరమైనప్పుడు తన విలువేంటో చూపించాలి. అందరిలా ఉంటే అతన్ని ఎందుకు కెప్టెన్‌ చేస్తారు. మరి అలాంటి కెప్టెన్‌ అనే పదానికి సరైన అర్థం చెప్పాడు వెస్టిండీస్‌ కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌. 

సంప్రదాయ క్రికెట్‌పై మోజు తగ్గుతున్న వేళ​ తన మారథాన్‌ ఇన్నింగ్స్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. 700 నిమిషాల(దాదాపు 12 గంటలు) పాటు క్రీజులో గడిపి 489 బంతులెదుర్కొని 17 ఫోర్ల సహాయంతో 160 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో బ్రాత్‌వైట్‌ విండీస్‌ దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. ఇంతకముందు టెస్టు క్రికెట్‌లో విండీస్‌ తరపున మారథాన్‌ బ్యాటింగ్‌ చేసిన వాళ్లలో బ్రియాన్‌ లారా, రామ్‌నరేశ్‌ శర్వాన​, వోరెల్‌లు ఉన్నారు. తాజాగా వీరి సరసన బ్రాత్‌వైట్‌ చోటు దక్కించుకున్నాడు.

కాగా బ్రియాన్‌ లారా టెస్టుల్లో రెండుసార్లు మారథాన్‌ ఇన్నింగ్స్‌లతో మెరిశాడు. 1994లో ఇంగ్లండ్‌పై 375 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడిన లారా దాదాపు 766 నిమిషాల పాటు క్రీజులో గడిపాడు. ఆ తర్వాత మళ్లీ 2004లో  అదే ఇంగ్లండ్‌పై చారిత్రాత్మక 400 పరుగులు నాటౌట్‌ (క్వాడప్రుల్‌ సెంచరీ) సాధించాడు. ఈ సమయంలో లారా 778 నిమిషాల పాటు క్రీజులో ఉండి ప్రపంచరికార్డు సాధించాడు. ఇక రామ్‌నరేశ్‌ శర్వాన్‌ 2009లో ఇంగ్లండ్‌పై 698 నిమిషాల పాటు బ్యాటింగ్‌ చేసి 291 పరుగులు సాధించాడు. 1960లో ఎఫ్‌ఎమ్‌ వోర్రెల్‌ బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా 682 నిమిషాల పాటు బ్యాటింగ్‌ చేసి 197 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు.

తాజాగా క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ 710 నిమిషాల పాటు బ్యాటింగ్‌ చేసి 160 పరుగులు సాధించి ఆ జాబితాలో రెండో స్థానాన్ని సంపాదించాడు. చేసింది తక్కువ స్కోరైనప్పటికి.. ఇంగ్లండ్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని అతను ఇన్నింగ్స్‌ ఆడిన తీరు అద్భుతమనే చెప్పాలి. అందుకే బ్రాత్‌వైట్‌ ఆటకు యావత్‌ క్రికెట్‌ అభిమానులు ఫిదా అయ్యారు.''సాహో బ్రాత్‌వైట్‌.. నీ ఇన్నింగ్స్‌కు.. ఓపికకు సలాం''..''టెస్టు క్రికెట్‌లో ఉండే మజాను రుచి చూపించావు''..''అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌ బ్లాక్‌బ్లాస్టర్‌ మార్కులు సాధించావు''అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. జాక్‌ క్రాలీ 21, అలెక్స్‌ లీస్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 411 పరుగులకు ఆలౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఇప్పటివరకు తొలి ఇన్నింగ్స్‌ కలుపుకొని 136 పరుగుల ఆధిక్యంలో ఉంది.
 

చదవండి: ENG vs WI: డెబ్యూ టెస్టులోనే ఇంగ్లండ్‌ బౌలర్‌కు వింత పరిస్థితి

మరిన్ని వార్తలు