ఇదీ రూట్‌.. ఒరిస్సా టు మహారాష్ట్ర  వయా హైదరాబాద్‌.. కానీ మధ్యలో..

20 Mar, 2022 09:09 IST|Sakshi

ఆలుగడ్డల మాటున గంజాయి లోడ్‌ 

అడ్డుకున్న సైబరాబాద్‌ పోలీసులు 

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

560 కిలోల గంజాయి స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: ఒరిస్సాలోని చిత్రకొండ ఏజెన్సీ నుంచి మహారాష్ట్ర, అమరావతికి హైదరాబాద్‌ మీదుగా గంజాయి  అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సరఫరాదారుడు, రిసీవర్‌ పరారీలో ఉండగా.. గంజాయి లోడ్‌ వాహన డ్రైవర్లను మాత్రమే అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి  560 కిలోల 
గంజాయి. కారు, డీసీఎం, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర శనివారం వివరాలు వెల్లడించారు.

మహారాష్ట్ర అమరావతికి చెందిన నౌషాద్‌ ముంబై, అమరావతి ప్రాంతాల్లో గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. అతడికి ఉస్మాన్‌నగర్‌కు చెందిన సలీమ్‌ ఉల్లా అలియాస్‌ రాజు,  షేక్‌ రెహాన్, షేక్‌ వసీం సహకరించేవారు. ఒరిస్సా చిత్రకొండకు చెందిన సంతోష్‌ ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక సాగుదారుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి.. వివిధ రాష్ట్రాల్లోని గంజాయి విక్రేతలకు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం నౌషాద్‌.. సంతోష్‌ను సంప్రదించి, 1,000 కిలోల ఎండు గంజాయి ఆర్డర్‌ ఇచ్చాడు. అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు చెల్లించాడు. దీంతో సంతోష్‌ 560 కిలోల గంజాయిని సిద్ధం చేసి నౌషాద్‌కు సమాచారం అందించాడు. (చదవండి: హోలీ పండుగకు భార్య మటన్‌ వండలేదని 100కు కాల్‌.. )

నౌషాద్‌ భద్రాచలం నుంచి మహారాష్ట్రలోని అమరావతికి బంగాళదుంపలను రవాణా చేయాలని కోరుతూ.. హైదరాబాద్‌కు చెందిన ఇక్బాల్‌ను సంప్రదించాడు. ఈనెల 15న సలీం, రెహాన్, వసీం కారులో ఖమ్మం వెళ్లారు. అక్కడ ఇక్బాల్‌ ఏర్పాటు చేసిన డీసీఎం  తీసుకున్నారు. సలీం డీసీఎం నడుపుతూ భద్రాచలం వెళ్లి అక్కడ 3 టన్నుల బంగాళా దుంపలు లోడ్‌ ఎక్కించుకున్నాడు. అక్కడ్నుంచి ఈనెల 18న చిత్రకొండ ఏజెన్సీ అటవీ ప్రాంతంలో డీసీఎంను పార్క్‌ చేసి సంతోష్‌కు సమాచారం అందించాడు. సంతోష్‌ డీసీఎంలో 560  కిలోల గంజాయి లోడ్‌ చేసి మిగిలిన ముగ్గురికి సమాచారం అందించి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.

సలీం డీసీఎంను డ్రైవ్‌ చేస్తుండగా రెహాన్, వసీం కారులో ఎస్కార్ట్‌గా అమరావతి బయలుదేరారు. తెలంగాణ సరిహద్దులో తనికీలు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో నిందితులు టోల్‌ రోడ్లు రాకుండా డీసీఎంను దారి మళ్లించారు. హిమాయత్‌సాగర్‌ మీదుగా వెళుతుండగా.. విశ్వసనీయ సమాచారం అందుకున్న స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) శంషాబాద్, రాజేంద్రనగర్‌ పోలీసులు పీడీపీ క్రాస్‌రోడ్‌ వద్ద డీసీఎం, ఎస్కార్ట్‌గా వెళుతున్న కారును అడ్డుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి విషయం బయటపడింది. కిలో 1,250 చొప్పున కొనుగోలు చేసి.. వినియోగదారులకు రూ.20 వేలకు విక్రయిస్తున్నట్లు నిందితులు పేర్కొన్నారని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు