తుస్సుమన్న బాబర్‌ ఆజమ్‌.. తిప్పేసిన అనామక బౌలర్‌

31 Jul, 2023 15:59 IST|Sakshi

లంక ప్రీమియర్‌ లీగ్‌ 2023 ఎడిషన్‌ నిన్న (జులై 30) ప్రారంభమైంది. కొలొంబో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్‌, కొలొంబో స్ట్రయికర్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్‌ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన జాఫ్నా కింగ్స్‌.. తౌహిద్‌ హ్రిదోయ్‌ (39 బంతుల్లో 54; 4 ఫోర్లు, సిక్స్‌) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.

నిషాన్‌ మధుష్క (12), గుర్భాజ్‌ (21), అసలంక (12), ప్రియమల్‌ పెరీర (22) రెండంకెల స్కోర్లు చేసినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఆఖర్లో దునిత్‌ వెల్లలగే (25 నాటౌట్‌), కెప్టెన్‌ తిసార పెరీరా (14 నాటౌట్‌) వేగంగా పరుగులు సాధించడంతో జాఫ్నా కింగ్స్‌ ఓ మోస్తరు స్కోర్‌ను ప్రత్యర్ధి ముందు ఉంచగలిగింది. కొలొంబో బౌలర్లలో నసీం​ షా, మతీష పతిరణ, చమిక కరుణరత్నే, సందకన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

తిప్పేసిన అనామక బౌలర్‌..
174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొలొంబో.. జాఫ్నా బౌలర్‌, అనామక కుర్రాడు విజయకాంత్‌ వియాస్‌కాంత్‌ (4-0-17-2)  మాయాజాలం ధాటి​కి 19.4 ఓవర్లలో 152 పరుగులకు కుప్పకూలింది. విజయకాంత్‌తో పాటు హర్దుస్‌ విల్జోయెన్‌ (3/31), దిల్షన్‌ మధుషంక (2/18), తిసార పెరీరా (1/29) రాణించడంతో కొలొంబో టీమ్‌ ఓ మోస్తరు స్కోర్‌ను కూడా ఛేదించలేకపోయింది.  

తుస్సుమన్న బాబర్‌ ఆజమ్‌..
జాఫ్నాతో పోలిస్తే చాలా రెట్టు పటిష్టమైన కొలొంబో స్ట్రయికర్స్‌ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. కెప్టెన్‌ నిరోషన్‌ డిక్వెల్లా  (34 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్‌) ఒక్కడు అర్ధసెంచరీతో రాణించాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి తుస్సుమన్నాడు. తిసార పెరీరా బౌలింగ్‌లో బౌండరీ బాదిన అనంతరం బాబర్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆతర్వాత వచ్చిన నిస్సంక (1), ఫెర్నాండో (17), మహ్మద్‌ నవాజ్‌ (3), యశోధ లంక (11), నసీం షా (0), పతిరణ (8) నిరాశపరచగా.. తమిక కరుణరత్నే (23) పర్వాలేదనిపించాడు. 

మరిన్ని వార్తలు