హరీస్‌ ఉతుకుడు.. హసరంగ 'ఆరే'సుడు

18 Aug, 2023 14:54 IST|Sakshi

లంక ప్రీమియర్‌ లీగ్‌-2023లో భాగంగా జాఫ్నా కింగ్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 17) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బి లవ్‌ క్యాండీ ఘన విజయం సాధించింది. క్యాండీ కెప్టెన్‌ వనిందు హసరంగ తన స్పిన్‌ మాయాజాలంతో జాఫ్నా కింగ్స్‌ను టోర్నీ నుంచి ఎలిమినేట్‌ చేశాడు. అంతకుముందు మహ్మద్‌ హరీస్‌ బ్యాట్‌తో చెలరేగడంతో క్యాండీ టీమ్‌ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. 

హరీస్‌ ఉతుకుడు..
తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాండీ.. ఓపెనర్‌ మహ్మద్‌ హరీస్‌ (49 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్‌ చండీమల్‌ (24 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్‌) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. క్యాండీ ఇన్నింగ్స్‌లో హరీస్‌, చండీమల్‌ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. జాఫ్నా బౌలర్లలో నువాన్‌ తుషార 4 వికెట్లతో విజృంభించగా.. మహీష్‌ తీక్షణ, గుణరత్నే తలో 2 వికెట్లు పడగొట్టారు. 

హసరంగ 'ఆరే'సుడు..
189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జాఫ్నా.. హసరంగ (3.2-0-9-6) మాయాజాలం ధాటికి 17.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా క్యాండీ టీమ్‌ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. రేపు (ఆగస్ట్‌ 19) జరుగబోయే క్వాలిఫయర్‌-2లో క్యాండీ టీమ్‌.. గాలే టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. క్యాండీ చేతిలో ఓటమిపాలైన జాఫ్నా లీగ్‌ నుంచి నిష్క్రమించింది. కాగా, ఈ మ్యాచ్‌లో హసరంగ నమోదు చేసిన గణాంకాలు (6/9) లంక ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యుత్తమ గణాం‍కాలు కావడం​ విశేషం.

బ్యాట్‌తోనూ చెలరేగిన హసరంగ..
జాఫ్నాతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో క్యాండీ కెప్టెన్‌ హసరంగ బ్యాట్‌తోనూ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న హసరంగ 2 భారీ సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేశాడు. ప్రస్తుత LPL సీజన్లో హసరంగ బంతితో పాటు బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన హసరంగ 17 వికెట్లు పడగొట్టడంతో పాటు 8 ఇన్నింగ్స్‌ల్లో 231 పరుగులు చేసి, సీజన్‌ నాలుగో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.   

ఫైనల్లో డంబుల్లా..
నిన్ననే జరిగిన క్వాలిఫయర్‌-1లో డంబుల్లా ఔరా.. గాలే టైటాన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టైటాన్స్‌.. లసిత్‌ క్రూస్‌పుల్లే (61 బంతుల్లో 80; 7 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్‌ కాగా.. డంబుల్లా 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కుశాల్‌ పెరీరా (53) అర్ధసెంచరీతో రాణించి, డంబుల్లాను గెలిపించాడు.

మరిన్ని వార్తలు