Malaysia Open: తొలి రౌండ్‌లోనే అవుట్‌.. పోరాడి ఓడిన సాయి ప్రణీత్‌

29 Jun, 2022 07:30 IST|Sakshi
సాయి ప్రణీత్‌(ఫైల్‌ ఫొటో)

సాయిప్రణీత్‌కు నిరాశ

మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ  

కౌలాలంపూర్‌: భారత అగ్రశ్రేణి షట్లర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ మలేసియా ఓపెన్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 19వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 15–21, 21–19, 9–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ జిన్‌టింగ్‌ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.

ఈ సీజన్‌లో సాయిప్రణీత్‌ ఏడు టోర్నీలలో పాల్గొనగా, ఆరింటిలో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. మరోవైపు సమీర్‌ వర్మ కూడా తొలి రౌండ్‌లోనే ఓడిపోగా, ప్రణయ్‌ శుభారంభం చేశాడు. 2018 ఆసియా క్రీడల చాంపియన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) 21–14, 13–21, 21–7తో సమీర్‌ వర్మను ఓడించగా... ప్రణయ్‌ 21–14, 17–21, 21–18తో డారెన్‌ లూ (మలేసియా)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు.

పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 21–18, 21–11 తో మాన్‌ వె చోంగ్‌–కయ్‌ వున్‌ టీ (మలేసియా) జోడీపై గెలి చింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని (భారత్‌) జంట 15– 21, 11–21తో మత్సుయామ–చిహారు (జపాన్‌) జోడీ చేతిలో ఓడింది. 
చదవండి: Wimbledon 2022: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఆ ఘనత సాధించిన ఏకైక మొనగాడిగా రికార్డు

మరిన్ని వార్తలు