Suryakumar Yadav: సూర్యను కొనగలిగే స్థోమత, డబ్బు మా దగ్గర లేదు.. ఆటగాళ్లందరిపై వేటు వేస్తేనే!

23 Nov, 2022 16:36 IST|Sakshi
సూర్యకుమార్‌ యాదవ్‌

Suryakuma Yadav: టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లలో సూర్య సంచలన ఇన్నింగ్స్‌ చూడాలని ఉన్నా.. అతడిని కొనే స్థోమత క్రికెట్‌ ఆస్ట్రేలియాకు లేదని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ను అందుకోవడం ప్రపంచంలోని ఏ ఆటగాడకి సాధ్యం కాదని కొనియాడాడు.

లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా
మూడు పదుల వయసులో టీమిండియా తరఫున గతేడాది అరంగేట్రం చేసిన ముంబై బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌-2022లో 239 పరుగులు చేసిన ఈ ముంబైకర్‌.. న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లోనూ మెరిశాడు.

కివీస్‌తో రెండో టీ20 సందర్భంగా పొట్టి ఫార్మాట్‌లో రెండో శతకం నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతున్న సూర్యపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో ది గ్రేడ్‌ క్రికెటర్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ‘స్కై’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 


గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (PC: Glenn Maxwell Twitter)

సూర్య.. వేరే లెవెల్‌.. అంతే!
‘‘నిలకడైన ఆటకు మారుపేరుగా మారి మాకు తలనొప్పి తెప్పిస్తున్నాడంటే నమ్మండి! ఆస్ట్రేలియా.. కాదు కాదు ప్రపంచంలోనే ఇప్పుడు తన దరిదాపుల్లోకి వెళ్లే ఆటగాడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే, ఐపీఎల్‌లో తన ప్రదర్శనతో ఒక్కోసారి జోస్‌ బట్లర్‌.. యాదవ్‌తో పోటీపడగలడు. ఏదైమైనా ‘స్కై’ది వేరే లెవల్‌!’’ అంటూ ఈ పవర్‌ హిట్టర్‌ సూర్యను కొనియాడాడు. 

ఆ స్థోమత మాకు లేదు!
ఇక బిగ్‌బాష్‌ లీగ్‌ ప్రస్తావన నేపథ్యంలో.. ‘‘మా దగ్గర సూర్యకుమార్‌ను కొనగలిగేంత డబ్బు లేదు. ఒకవేళ తనను సొంతం చేసుకోవాలనుకుంటే.. క్రికెట్‌ ఆస్ట్రేలియా జట్టులోని ప్రతి ఆటగాడు.. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ప్లేయర్లను తొలగించాల్సి వస్తుందేమో! అందరి జీతం కట్‌చేస్తే.. అప్పుడైనా తనను కొనగలిగే స్థోమత వస్తుందనుకుంటా’’ అంటూ మాక్సీ.. సూర్యకుమార్‌ను ఆకాశానికెత్తాడు.

కాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సత్తా చాటుతున్న సూర్య ‍త్వరలోనే టెస్టుల్లోనూ అరంగేట్రం చేస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బోర్డుతో తెగదెంపులు చేసుకున్న తర్వాతే ప్రపంచంలోని ఇతర క్రికెట్‌ లీగ్‌లలో ఆడే అవకాశం ఉంటుందని బీసీసీఐ గతంలోనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సూర్య గురించి మాక్స్‌వెల్‌ సరదాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఇటీవల కాలు విరగ్గొట్టుకున్న మాక్సీ..  మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు.

చదవండి: NZC: సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ వదులుకున్న మరో న్యూజిలాండ్‌ ప్లేయర్‌! దేశం తరఫున ఆడటం..
Hardik Pandya: వాళ్లిద్దరిని ఎందుకు ఆడించలేదు! ఇది నా జట్టు.. బయటి వాళ్ల మాటలు పట్టించుకోను!

మరిన్ని వార్తలు