సాకేత్‌ జోడీకి పతకం ఖాయం 

28 Sep, 2023 01:54 IST|Sakshi

ఆసియా క్రీడల టెన్నిస్‌లో బుధవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్‌ విభాగంలో సాకేత్‌ మైనేని–రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోడీ సెమీఫైనల్‌ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్, మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయారు. క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌–రామ్‌కుమార్‌ ద్వయం 6–1, 7–6 (10/8)తో జిజెన్‌ జాంగ్‌–యిబింగ్‌ వు (చైనా) జంటను ఓడించింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్‌కిది ఆసియా క్రీడల్లో మూడో పతకం కానుంది. 2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లో సాకేత్‌ పురుషుల డబుల్స్‌లో రజతం, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణం సాధించాడు. సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సుమిత్‌ నగాల్‌ 7–6 (7/3), 1–6, 2–6తో టాప్‌ సీడ్‌ జిజెన్‌ జాంగ్‌ (చైనా) చేతిలో, అంకిత రైనా 6–3, 4–6, 4–6తో హరూకా కాజి (జపాన్‌) చేతిలో పోరాడి ఓడిపోయారు. 

మరిన్ని వార్తలు