'పైన్‌ను తీసేయండి.. అతన్ని కెప్టెన్‌ చేయండి'

27 Jan, 2021 17:06 IST|Sakshi

సిడ్నీ: టీమిండియాతో జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ టెస్టు సిరీస్‌లో ఆసీస్‌ 2-1 తేడాతో ఓడిపోవడంపై ఆ జట్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్‌పై నోరు పారేసుకొని కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు మైకేల్‌ క్లార్క్ ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌‌ పాట్‌ కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయాలంటూ సీఏకు సూచించాడు. ప్రస్తుతం కమిన్స్‌ టెస్టుల్లో ప్రపంచ నెంబర్‌ వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.చదవండి: టాప్‌లో కోహ్లి.. రెండుకే పరిమితమైన రోహిత్‌

'ఆసీస్‌ జట్టులో ప్రస్తుతం కమిన్స్‌కు కెప్టెన్‌ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అతను ఫాంలో ఉంటే ఎంతలా రెచ్చిపోతాడనేది టీమిండియాతో జరిగిన సిరీస్‌ అందుకు నిదర్శనం. బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన కమిన్స్‌ తన ప్రవర్తనతోనూ ఆకట్టుకున్నాడు. టిమ్‌ పైన్‌ కెప్టెన్సీని నేను తప్పుబట్టలేను.. బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌లో మాత్రం అతను ఒక కెప్టెన్‌గా తన చర్యలతో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే కమిన్స్‌ కెప్టెన్‌ను చేయాలంటే స్మిత్‌, వార్నర్‌, హాజిల్‌వుడ్‌, నాథన్‌ లయన్‌ లాంటి ఉన్న సీనియర్‌ ఆటగాళ్ల మద్దతు కావాల్సిందే.' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ఆసీస్‌ జట్టుకు పరిమిత ఓవర్లతో పాటు టీ20ల్లో ఆరోన్‌ ఫించ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో ప్రపంచ నెంబర్‌వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్న కమిన్స్‌ 34 టెస్టుల్లో 164, 69 వన్డేల్లో 111, 30 టీ20ల్లో 37 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ బౌలర్‌గా మంచి క్రేజ్‌ ఉన్న కమిన్స్‌ను 2019 డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో కేకేఆర్‌ జట్టు రూ. 15.5 కోట్లకు కొనుగోలు చేసింది. చదవండి: చెన్నై వేదికగా ఐపీఎల్‌ 2021 మినీ వేలం

మరిన్ని వార్తలు